బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్‌కు లేదు..

Congress has no ability to stop BJP..– కమలం చెంతకు చేరే మొదటి వ్యక్తి రేవంతే..
– జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటానని ఆయన అనటం లేదు…
– ఢిల్లీకి రూ.2,500 కోట్లు పంపిన ఘనుడాయన : ‘సికింద్రాబాద్‌’ సమీక్షా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– డుమ్మా కొట్టిన సాయికిరణ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో బీజేపీని నిలువరించే శక్తి, సత్తా కాంగ్రెస్‌కు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీలో చేరే మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంతేననీ, ఆయన తన జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటానంటూ చెప్పటం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీలో ఆయన చేరికపై వస్తున్న విమర్శలను రేవంత్‌ ఖండించటం లేదని గుర్తు చేశారు. ‘జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబుదొంగ రేవంత్‌… భవనాలకు అనుమతుల పేరిట వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి సామంతరాజులా పంపారు…’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా దాటబోవంటూ కేటీఆర్‌ ఈ సందర్భంగా విమర్శించారు.
బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంటు సన్నాహక సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తోపాటు సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు. అయితే త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ (మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు) ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ మంత్రి తలసాని కూడా మీటింగు మధ్యలోనే వెళ్లిపోవటం గమనార్హం. సభకు అధ్యక్షత వహించిన మాగంటి గోపీనాథ్‌, సీనియర్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవటం చర్చనీయాంశమైంది. సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ…రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా, సీఎం రేవంత్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవలే పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఆయన అసహనం, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ప్రస్తుతం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌.. మోడీని చౌకీదార్‌ చోర్‌ అని అంటుంటే, రేవంత్‌ మాత్రం ప్రధానిని బడేభారు అంటూ సంబోధిస్తున్నారని గుర్తు చేశారు. ఆదానీ అనే వ్యక్తి మంచోడు కాదని రాహుల్‌ విమర్శిస్తుంటే..రేవంత్‌ మాత్రం ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇసుక దందా, రైస్‌ మిల్లర్లను బ్లాక్‌ మెయిల్‌ చేయటం, బిల్డర్లను, రియల్టర్లను బెదిరించటం లాంటి వార్తలను బయటకు పొక్కనీయకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. వాటి పేరు చెప్పి ఆ పార్టీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. పురపాలక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌ మూడు నెలలుగా ఎందుకు భవనాలకు అనుమతులనివ్వటం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి సమాధానం చెప్పకుండా పేగులు మేడలేసుకుంటా… అంటూ ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను అమలు చేయటానికి చేతగాని ముఖ్యమంత్రి అలాంటి అంశాలను పక్కదోవ పట్టించటానికి ఫోన్‌ ట్యాపింగులు, స్కాములు అంటూ పత్రికల్లో వార్తలు రాయించుకుంటున్నారని విమర్శించారు. ‘ఎవరు ఏ తప్పు చేసినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మీ చేతిలో అధికారం ఉంది. చర్యలు తీసుకోండి…’ అంటూ సీఎంకు సవాల్‌ విసిరారు.
దానం పచ్చి అవకాశవాది…
కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పచ్చి అవకాశవాదంటూ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో సికింద్రాబాద్‌ అంటేనే పద్మారావు పేరు గుర్తుకొస్తుందని అన్నారు. 24 ఏండ్ల నుంచి పార్టీకి హైదరాబాద్‌లో ఆయన అండగా ఉంటూ వస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను వీడటం తప్పని దానం తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఆయన అధికారం కోసం ఆశపడి, తనకు ఓట్లేసిన ప్రజలను సైతం మోసం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమర్శించారు. గతంలో ఒక పార్టీని వీడి ఆసిఫ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయాన్ని దానం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు కూడా మంచిది కాదనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని సూచించారు. దానంపై స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పదవికి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ కోరారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు దాకానైనా వెళతామని అన్నారు. మూడు నెలల్లోగా ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తుందనీ, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండి, పార్టీకి ద్రోహం చేసిన దానంకు బుద్ధి చెప్పాలని సూచించారు. గత ఐదేండ్ల నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాముడిని అడ్డం పెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘ఇప్పటిదాకా బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. అందుకే కవితను అరెస్టు చేయలేదంటూ కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు ఏం చెబుతారు…?’ అంటూ ప్రశ్నించారు. బీజేపీ తమపైనా, తమ పార్టీపైనా పగబట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love