రె’ఢీ’..!

Re'dhi'..!– ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు
– ‘ఆరు’ గ్యారంటీలతో రంగంలోకి కాంగ్రెస్‌
– మోడీ భజన, అభ్యర్థి సెల్ఫ్‌ డబ్బాతో బీజేపీ ముందుకు..
– గత అభివృద్ధి మాటున బీఆర్‌ఎస్‌ ప్రచారం
– ‘మల్కాజిగిరి’ సెగ్మెంట్‌లో త్రిముఖ పోటీొ ఏడు నియోజకవర్గాల్లో వేడెక్కిన రాజకీయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో జెండా ఎగరేయడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు రె’ఢ’ అవుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. గెలుపే లక్ష్యంగా ముగ్గురూ ఎవరికి వారే ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆరు గ్యారంటీల పేరు, వంద రోజుల పాలన పేరుతో కాంగ్రెస్‌ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. బీజేపీ మోడీ భజనతోపాటు అభ్యర్థి సెల్ఫ్‌ డబ్బాతో ప్రచారం నిర్వహిస్తున్నది. ఇక బీఆర్‌ఎస్‌ గతంలో వారి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ, వంద రోజుల పాలనలో అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచార పర్వం సాగిస్తున్నది. నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కింది.
సీఎం సిట్టింగ్‌ స్థానం కావడంతోపాటు మినీ భారత్‌గా పిలువబడే మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ తరపున వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితా మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో దిగడంతో రాజకీయం వేగంగా వేడెక్కింది. బీజేపీ ఇప్పటికే రోడ్డు షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా.. కాంగ్రెస్‌ విస్త్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా తన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ, క్యాడర్‌ను కదిలించే ప్రయత్నం చేస్తోంది.
మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ స్థానాలు
మల్కాజిగిరి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్‌, హైదరాబాద్‌ జిల్లాలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉంది. ఇది సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానం కావడంతో పాటు మినీ భారత్‌గా పేరుండటంతో ప్రాధాన్యత సంచతరించుకుంది. ఈ సెగ్మెంట్‌లో ఏడు నియోజకవర్గాలతో కలిపి 37,28,519 మంది ఓటర్లు ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌
తన సిట్టింగ్‌ స్థానం కావడంతో ‘మల్కాజిగిరి’పై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కీలక నేతలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు పెంచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, బీజేపీ ఆగడాలను అర్థమయ్యేలా విడమడిచి చెబుతూ మందుకు సాగుతున్నారు.
బీఆర్‌ఎస్‌ మందగమనం..
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఇంకా స్పీడ్‌ అందుకోలేదు. అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో నియోజకవర్గం పరిధిలోని అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైనా ప్రచారం మాత్రం మందకొడిగానే సాగుతోంది. ఆరుగురు ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్‌ వారే అయినా సరైన సహకారం లేకపోవడంతో అభ్యర్థి అంతర్మథనంలో పడ్డారు. రానున్న రోజుల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు హౌరాహౌరీగా ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. చివరికి ‘మల్కాజిగిరి’ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి..!
రామమందిరం, కేంద్ర పథకాలే అస్త్రాలు..
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఇప్పటికే పార్లమెంట్‌ పరిధిని ఓ సారి చుట్టేశారు. ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తూ, తన సెల్ప్‌ డబ్బా కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాను గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. కాంగ్రెస్‌ తనపై చేసి వ్యాఖ్యలు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు, బస్తీలు, పురపాలక సంఘాలు, డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం మొదలు ఆర్థరాత్రి వరకు ప్రచారంలోనే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్యలో రామమందిరమే ఎజెండాగా ఈటల ముందుకు సాగుతున్నారు.

Spread the love