– కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో దేశ చరిత్రలో గురువారం మరో చీకటి రోజుగా మిగిలిపోనుందని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ చర్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేజ్రీవాల్ అరెస్టును ఒక రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆయన అభివర్ణిం చారు. ఢిల్లీ సీఎంపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్షాలను నామరూపాల్లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరి స్తోందని విమర్శించారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టులు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు పావులుగా వాడుకుంటోందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన
నాగర్ కర్నూల్‌కు ఆర్‌ఎస్పీ.. మెదక్‌కు వెంకట్రామిరెడ్డి
మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూల్ సీటుకు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను, మెదక్‌కు మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ పి.వెంకట్రా మిరెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసి, ప్రకటించారు.