– తమకే సీట్లివ్వాలంటూ అధిష్టానానికి మొర
– జనగామలో ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు
– ఎమ్మెల్సీ పల్లాకు సీటివ్వాలంటూ భేటీలు
– ఘన్‌పూర్ తనదేనంటున్న రాజయ్య
– ఉప్పల్‌లోనూ అదే తిప్పలు
– శేరిలింగంపల్లిలోనూ అలాంటి సీనే
– అధికార బీఆర్‌ఎస్‌లో పరిస్థితి ఇది…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనసభకు ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్‌ఎస్‌లో సీట్ల కోసం పోటా పోటీ నెలకొంటున్నది. ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి తలెత్తుతున్నది. సిట్టింగులకు, ఆశావహులకు, మాజీ ఉద్యమకారులకు మధ్య సీట్ల కోసం పంచాయితీ నడుస్తున్నది. తాజాగా జనగామ స్థానం నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు పార్టీకి సూచించారు. ఆయన్ను ఈసారి పోటీలో ఉంచితే… తాము వ్యతిరేకంగా పని చేస్తామనే సంకేతాలను కూడా వారు ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఈ అసంతృప్త నేతలందరూ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆ ప్లాజాలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో వారు ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి… ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెవికి చేరటంతో ఆయన ఖంగు తిన్నారు. ఆ వెంటనే తేరుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చిన ఆయన… టూరిజం ప్లాజాకు చేరుకుని తనకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నేతలపై సీరియస్ అయినట్టు తెలిసింది. ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు…’ అంటూ ఆయన వారిని నిల దీశారు. ‘నియోజకవర్గ పనులపై మాట్లాడేందు కోసం వచ్చాం…’ అంటూ వారు చెప్పటంతో ఆయన ఈ విషయమై సీఎంతో చర్చించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లినట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా పల్లాకు టిక్కెట్ ఇవ్వాలంటూ జనగామ స్థానిక నేతలు ఇప్పటికే సీఎంకు విజ్ఞప్తి చేయటం గమనార్హం.
ఇదే సమయంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సైతం… తన సీటు విషయంలో బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో స్థానికేతర నాయకు లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ నేను మాత్రం లోకల్.. ఈసారి కూడా నన్నే గెలిపించండి…’ అంటూ ఆయన ఓటర్లను అభ్యర్థించటాన్ని బట్టి ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉన్న పోటీ ఏంటో విదితమవుతున్నది. ఇదే క్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోని ఉప్పల్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డికి… మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రూపంలో తీవ్ర పోటీ ఎదురవుతున్నదని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాగైనా సీటు దక్కించుకోవటమేగాదు.. గెలిచి తీరాలనే కాంక్షతో రామ్మోహన్ ఉన్నట్టు ఆయా వర్గాలు పేర్కొనటం గమనార్హం. మరోవైపు సెటిలర్లు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం కారుకు తలనొప్పులు తప్పటం లేదు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి సొంత పార్టీ నుంచే పోటీ ఎదురవుతున్నది.
ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండి రమేశ్… గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి… తనకు ఎలాగైనా ఈసారి అవకాశమివ్వాలంటూ రమేశ్ కోరినట్టు తెలిసింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రకంగా బీఆర్‌ఎస్‌లో అసెంబ్లీ సీట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఈ పోటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.