లింగ వివక్షను చూపే

– మూసపదాలను ఉపయోగించకండి !
– హ్యాండ్‌బుక్‌ను ప్రచురించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: లింగ వివక్ష ప్రదర్శించేలా న్యాయమూర్తులు, న్యాయ వాదులు తరచుగా తమ తీర్పుల్లో, వాదనల్లో ఉపయోగించే మూస పదాలను నివారించి, వాటి స్థానంలో ఉపయోగించాల్సిన ప్రత్యామ్నాయా లను పేర్కొంటూ సుప్రీంకోర్టు ఒక హ్యాండ్‌ బుక్‌ను తీసుకువచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ బుధవారం ఈ మేరకు కోర్టులో ఒక ప్రకటన చేశారు. ఇప్పటివరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు చేసిన కృషిని విమర్శించడం ఈ హ్యాండ్‌బుక్‌ ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. న్యాయ క్రమంలో మహిళలను గురించి ప్రస్తావిస్తూ వాడే కొన్ని మూస పదాలను గుర్తించడానికి, అర్ధం చేసుకోవడానికి ఇది సహాయ పడుతుందని ముందు మాటలో చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ మూస పదాల వినియోగం ఒక కేసులో ఇచ్చే తీర్పును మార్చకపోవచ్చు కానీ మన రాజ్యాంగ నైతిక విలువలకు విరుద్ధమైన భావజాలాన్ని ప్రభావితం చేయవచ్చని అన్నారు. న్యాయ పరిభాషలో వాడే కొన్ని పదాలు లేదా వాక్యాలు పితృస్వామ్య భావజాలపు ఆలోచనలను ప్రతిబింబించేలా వున్నాయని అన్నారు. 30పేజీల ఈ పుస్తకంలో మార్చాల్సిన మూసపదాల వివరాలను, వాటి స్థానంలో పొందుపరచాల్సిన ప్రత్యామ్నాయాలను పేర్కొన్నారు. ఉదాహరణకు వ్యభిచారి అనే పదం బదులు సెక్స్‌ వర్కర్‌ అని వాడాల్సిందిగా సూచించారు.

Spread the love