కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి

– సీఐటీయూ యూనియన్‌ రాష్ట్ర నాయకులు బలరాం
– కోఠి డీఎంహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ధర్నా
– నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌
– రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో రెండో ఏఎన్‌ఎంలు
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌/మొఫసిల్‌ యంత్రాంగం
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు బలరాం డిమాండ్‌ చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో పెద్దఎత్తున ఏఎన్‌ఎంలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్‌ఎంలు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వీరిని రెగ్యులర్‌ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి రాత పరీక్షల ద్వారా రెగ్యులర్‌ ఉద్యోగంలోకి రావాలనడం అన్యాయమన్నారు. నోటిఫికేషన్‌ రద్దు చేసి కాంట్రాక్టు ఏఎన్‌ఎంలందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నగర అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు సమ్మెలో ఉండటంతో ప్రభుత్వ కార్యక్ర మాలు, వైద్యారోగ్య శాఖలో వైద్య సేవలు నిలిచి పోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని కోరారు. ఇతర డిపార్ట్‌మెంట్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ, ఆర్టీసీ వారిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వరాల జల్లు కురిపిస్తున్న ప్రభుత్వం.. అదే పద్ధతిలో వైద్యారోగ్య శాఖలో కూడా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు కవిత, నగర ప్రధాన కార్యదర్శి కిరణ్మయి, నగర నాయకులు రాజేశ్వరి, లక్ష్మి, అమ్మాజీ, విజయ, ప్రణయశీల, వందన, నళిని, సునీత, శ్యామల, రమాదేవి, పుష్ప, స్వాతి పాల్గొన్నారు.
జిల్లాల్లో..
రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిర్వహిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీ ధర్నాచౌక్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. వనపర్తి జిల్లా అసిస్టెంట్‌ వైద్యాధికారికి సమ్మె నోటీసు అందజేశారు. సంగారెడ్డిలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాల యం ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ.. సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఎన్నో ఏడ్లుగా గ్రామాల్లో పని చేస్తున్నా పర్మనెంట్‌ చేయకపోవడం దుర్మార్గమన్నారు. సిద్దిపేట, మెదక్‌లోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయాల ఎదుటా ధర్నా చేశారు.
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని, కొత్తగా రిక్రూట్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చౌక్‌లో సమ్మెను సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌ ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంపీహెచ్‌ఏ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయడంతోపాటు ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు లంక రాఘవులు అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించారు.

Spread the love