‘ఆరోగ్య మిత్ర’లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

– రూ. 28 వేల వేతనం ఇవ్వాలి :సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఆరోగ్య మిత్ర’లకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ లేదంటే పోరుబాట తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరోగ్య మిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో భూపాల్‌ మాట్లాడారు. ఆరోగ్య మిత్రలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 800 మంది 16 సంవత్సరాలుగా పనిచేస్తుంటే వేతనం రూ’15,600 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్‌ 60 ప్రకారం డేటా ఎంట్రీ ఆఫీసర్‌గా చేసినా..అందుకు తగిన వేతనం ఇవ్వకుండా అన్‌ స్కిల్డ్‌ వేతనం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వారికి రూ.28 వేల వేతనాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలనీ, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఆరోగ్య మిత్రల పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు.
సమ్మెకు సన్నద్ధం..
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ సంఘం నేతలు వాపోయారు. అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నామనీ, పెరుగుతున్న ధరలు, అవసరాల రీత్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు పలుసార్లు సమస్యలను విన్నవించామని తెలిపారు. అనివార్యమైన స్థితిలో సమ్మె చేయాల్సిన స్థితి ఏర్పడుతున్నదనీ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆరోగ్య మిత్రల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్‌, ఉపాధ్యక్షులు పి. విష్ణు, నాయకులు నరేష్‌ కుమార్‌, మహేందర్‌, చిరుమప్ప, గోవిందరెడ్డి, స్వామి, అనుజ, స్వప్న, రమాదేవి, సుమ తదితరులు పాల్గొన్నారు.

Spread the love