భూ ఆక్రమణదారులను వదిలి గుడిసె వాసులపై ప్రతాపమా?

పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించే వరకు పోరాటం: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
నిలువ నీడ లేని నిరుపేదలకు స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను ధ్వంసం చేస్తూ అరాచకాలను సాగిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ 14 నుంచి 16 వరకు స్థానిక లహరి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించే రాజకీయ శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన రావు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌.. ఉద్యమంలో భాగస్వాములై పలు అనారోగ్య కారణాలతో మృతి చెందిన నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఈ తరగతుల్లో వీరయ్య ”రాజకీయ పరిస్థితులు” అనే అంశాన్ని రైతు ప్రతినిధులకు బోధించారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో 6 పోరాట కేంద్రాల్లో వేలాది మంది పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోసం పోరాటం చేస్తుంటే.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కైన రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పేదలు గుడిసెలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలు నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలు వరకు గుడిసెలు కూల్చే పనిలో ప్రభుత్వ అధికారులు తలమునకలు అయ్యారన్నారు. ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను ఆక్రమించిన పెద్దలను వదిలేసి పేదలు గుడిసెలు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం ద్వారా పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. 58 జీఓ ప్రకారం స్వాధీనంలో ఉన్న భూములకు ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, 59 జీఓ తెచ్చి తిరిగి ధనవంతులకే మేలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నిర్ణయించిందని చెప్పారు. ఆ మేరకు ఈ నెల 19 నుంచి 24 వరకు పేదలతో వ్యక్తిగతంగా తహసీల్దార్‌కు దరఖాస్తులు చేయించడం, ధర్నాలు చేపడతామని తెలిపారు. ఈనెల 18 నుంచి 21 వరకు బస్సు యాత్ర చేపట్టి పేదలను సమీకరించి పోరాటాలకు సన్నద్దం చేస్తామని ప్రకటించారు. చివరిగా జులై 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల ముందు మహాధర్నా నిర్వహించి పేదలు గొంతుకగా ప్రభుత్వానికి మొరవినిపిస్తామన్నారు. అనంతరం ”రైతు ఉద్యమం” అనే అంశం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన రావు బోధించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, మాదినేని రమేష్‌, వి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, సహాయ కార్యదర్శులు కందాల ప్రమీల, బొంతు రాంబాబు, డి.బాల్‌ రెడ్డి, ఎం శ్రీనివాస్‌, బాలరాజు గౌడ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి వంశీ క్రిష్ణ, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love