జీపీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?

– కొత్తగూడెంలో సమ్మెకు మద్దతు తెలిపిన.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
– కొనసాగుతున్న.. పంచాయతీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ-విలేకరులు
పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 18 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని జీపీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాపితంగా సమ్మె చేస్తున్నారని, కార్మికుల సమ్మె ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తూ వారి సహనాన్ని పరీక్షించొద్దని హితువు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కార్మికులు వంటావార్పు నిర్వహించారు. అశ్వారావుపేటలో స్థానిక మూడు రోడ్ల కూడలిలో చెవిలో పువ్వు.. చేతిలో చిప్పతో.. కార్మికులు నిరసన తెలిపారు. చండ్రుగొండలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. సారపాకలో సీఐటీయూ జిల్లా ఉపధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి సంఘీభావం తెలిపారు. మణుగూరు గ్రామపంచాయతీ కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. మంచాల, కందుకూరు, షాబాద్‌, వికారాబాద్‌, పరిగి మండలాల్లో చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో ఆలేరు, మోటకొండూరు మండలాల్లో జీపీ కార్మికులు సమ్మె నిర్వహించారు. భువనగిరి మండలంలో సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలో జీపీ కార్మికులు సమ్మె నిర్వహించారు. నల్లగొండ జిల్లా చండూర్‌, మర్రిగూడ, కట్టంగూరు, కేతేపల్లిలో సమ్మె కొనసాగింది. నాంపల్లిలో మోకాళ్లపై కూర్చోని నిరసన తెలిపారు.

Spread the love