ప్రమాదంలో ప్రజాస్వామ్యం

– భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం
– మోడీ ప్రభుత్వ బెదిరింపులపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన
– రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న డార్సే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రైతుల ఆందోళనకు సంబంధించిన కొన్ని ట్వీట్లను తొలగించని పక్షంలో ట్విట్టర్‌పై నిషేధం విధిస్తామని, ఉద్యోగుల నివాసాలపై దాడులు చేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం బెదిరించిందంటూ ఆ సంస్థ మాజీ సీఈఓ జాక్‌ డార్సే చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. మరోవైపు డార్సే ప్రకటనను ప్రభుత్వం తోసిపుచ్చగా పలువురు బీజేపీ నేతలు దీనిని అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించారు. అయితే ట్విట్టర్‌ వ్యవస్థాపకుడికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మోడీ ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేయడాన్ని గమనిస్తే భారత ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందన్న విషయం అర్థమవుతోంది.
దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం ఎంతైనా ఉంది. అది ప్రజలకు ప్రజాస్వామ్యం అందించిన పవిత్రమైన హక్కు. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడడానికి ఇది అంకుశంలా ఉపకరిస్తుంది. తమ భావాలను వ్యక్తపరచేం దుకు పౌరులకు మరింత స్వేచ్ఛ అందించి, వారికి సాధి కారత కల్పిస్తుంది. వారిని ఆలోచనాపరులుగా తీర్చిదిద్ది, సమస్యలపై గళం విప్పేలా చేస్తుంది. అమెరికా రాజ్యాంగం లో భావ ప్రకటనా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణలో కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కల్పించారు.
హక్కును అణచివేస్తున్నారు
అయితే డార్సే చెప్పిన మాటలను పరిశీలించినా, చాలా మందికి గతంలో ఎదురైన చేదు అనుభవాలను అవలోకనం చేసుకున్నా మోడీ ప్రభుత్వం ఈ స్వేచ్ఛను ఏకపక్షంగా, ఎలాంటి సమర్ధనీయమైన హేతుబద్ధత లేకుండా అణచివే స్తోందో అర్థమవుతుంది. ప్రజల మధ్య నిర్భయంగా చర్చ జరగడానికి అవకాశం కల్పించే అత్యంత ప్రాచుర్యం పొందిన వేదికగా ట్విట్టర్‌ కొనసాగుతున్న కాలమిది. ఈ వేదిక పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించడమంటే ఆర్టికల్‌ 19ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును నిర్భీతితో వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా దేశ పౌరులను అడ్డుకోవడాన్ని చూస్తుంటే ప్రభుత్వంలో నిరంకు శత్వం రోజురోజుకూ ఎలా పెరిగిపోతోందో తెలిసిపోతుంది.
ప్రభుత్వం తనకు చట్టప్రకారం సంక్రమించిన అధికారాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తోందో డార్సే చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం చట్టాలను రూపొందించి, వాటిని అమలు చేసేది ప్రజల కోసం కాదు. ప్రజలను అణచివేసేందుకు, వారి గొంతు నొక్కేందుకు మాత్రమే చట్టాలను ప్రయోగిస్తోంది.
నేరగాళ్ల ముఠా తరహాలో…
భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విషయంలో ప్రభుత్వ స్పందనను నేరచరితుల ముఠాతో పోల్చవచ్చు. ఎలాగంటే ఈ ముఠా బలవంతంగా అధికారాలను ఉపయోగించుకొని, ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేసి, వారు మౌనాన్ని ఆశ్రయించేలా చేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వా లతో అనుభవాలను గురించి చెప్పమని డార్సేను అడిగిన ప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి దేశం పేరు భారతదేశమే. మన దేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాం టిదని బీజేపీ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే అది భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా అణచివేస్తోందో ప్రపంచానికి ఇంకా తెలియదు. దేశంలో రాజకీయ స్వేచ్ఛ కూడా అణచివేతకు గురవుతోందన్న చేదునిజం డార్సే మాటల ద్వారా సభ్య ప్రపంచానికి తెలిసిపోయింది. రాజకీయ సమీకరణ కోసం తమకున్న రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించు కుంటున్న రైతుల ఆందోళనను పట్టించుకోవద్దంటూ ట్విట్టర్‌ను ప్రభుత్వం బెదిరించింది. దీంతో ప్రభుత్వాన్ని విమర్శించే వారి గొంతుకలు ప్రజలకు వినిపించలేదు. వారు కూడా తమ అభిప్రాయాలు సామాజిక మాధ్యమంలో పంచుకోలేకపోయారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. దీనిని ప్రతిఘటించేందుకు ప్రజలు, సంస్థలు ఏకమవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
ఏం చేయాలంటే…
మన ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న ఇలాంటి చర్యలకు వెంటనే అడ్డుకట్ట వేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయంగా సున్నితమైన అంశాలను సామాజిక మాధ్యమాల నుండి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో, ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ప్రభుత్వం ఒక పారదర్శకమైన అఫిడవిట్‌ను విడుదల చేయాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛను, రాజకీయ సమీకరణను అణచివేసేందుకు అవలంబించిన ఈ ప్రమాదకరమైన ధోరణిపై పరిశీలన జరపడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. సామాజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ తెలియజేయాలి. ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరులకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చట్ట సవరణను కూడా ఈ కమిటీ సూచించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలని అనుకుంటే అమెరికాలో మాదిరిగా ముందుగా దానిని దిగువ కోర్టు అంగీకరించాలి. దీనివల్ల ప్రభుత్వ ఆగడాలకు కళ్లెం వేయవచ్చు. డార్సే ఆరోపించిన విధంగా ప్రభుత్వ బెదిరింపులు రాజ్యాంగంలోని 19వ అధికరణకు భంగకరంగా ఉన్నందున అలాంటి చర్యలను సుప్రీంకోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అధికార దుర్వినియోగం జరగకుండా భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు విడుదల చేయాలి.

Spread the love