దేశాన్ని వీడుతున్న సంపన్నులు

– భారీగా పెరుగుతున్న వలసలు 2017-22 మధ్య ఇతరదేశాలకు..
– భారీ మొత్తంలో తరలి వెళ్తున్న దేశ సంపద
– ఉత్పత్తి, సంపద సృష్టి, ఉపాధిపై ప్రభావం : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ పాలనలో గుప్పెడు మంది సంపన్నులు తీవ్రంగా లాభపడ్డారు. వారి ఆస్తులు భారీగా పెరిగాయి. దేశ సంపదలో అధిక భాగం వారి చేతిలోనే ఉన్నది. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేటు అనుకూల విధానాలతో సంపన్నులు ఇంకా అభివృద్ధి చెందుతున్నారని మేధావులు అంటున్నారు. దీంతో దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతున్నదని చెప్తున్నారు. అంతేకాక, గత కొంత కాలంగా భారత్‌ నుంచి పెద్ద సంఖ్యలో సుసంపన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారని అంటున్నారు. ఒక మిలియన్‌ డాలర్‌, అంతకంటే ఎక్కువ నికర ఆస్తులను కలిగి ఉన్నవారిని అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ)గా పిలుస్తారు. 2017-2022 మధ్య హెచ్‌ఎన్‌ఐ లు 30,000 నుంచి 35,000 మంది దేశాన్ని విడిచి వెళ్లారు. ఒక్క 2022లోనే 8,000 హెచ్‌ఎన్‌ఐలు దేశాన్ని వీడారు. 2023లో ఈ సంఖ్య 6,500 మందిగా ఉన్నది. హెచ్‌ఎన్‌ఐలు మాత్రమే భారత్‌ను విడిచిపెట్టారు. ఇటీవల సంవత్సరాలలో ఇంత పెద్ద సంఖ్యలో హెచ్‌ఎన్‌ఐలు దేశం విడిచి వేరే చోట పౌరసత్వం తీసుకోవడం దురదృష్టకరమని మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య నిరంతరం పెరుగుతున్నదని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, 2015లో దేశంలో 2,36,000 హెచ్‌ఎన్‌ఐలు ఉన్నారు. ఈ సంఖ్య 2022 నాటికి 7,96,000కి పెరిగింది. ఇంకా, 2027 నాటికి ఈ సంఖ్య 16,50,000కి చేరుతుందని అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయి. సంపన్న వర్గంలోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్య.. విదేశాలకు వలస వచ్చిన వారి కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చూపిస్తున్నాయి.
యూఎస్‌, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూకేలు సంపన్న భారతీయులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలు ఉన్నాయి. సహజంగానే, ధనవంతులు భారత్‌ నుంచి వలస వచ్చినప్పుడు.. వారి సంపద కూడా వారితో పాటు తరలిపోతున్నది. ఇది ఆదాయ ఉత్పత్తి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. హెచ్‌ఎన్‌ఐలు భారత్‌ నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్నారని వారు చెప్తున్నారు. 2023లో ఇంగ్లాండ్‌(3200 మంది), రష్యా(3000), బ్రెజిల్‌(1200) దేశాల నుంచి కూడా ఇలాంటి వలసలు ఉన్నాయి. మొత్తానికి భారత్‌లో రెండు రకాల ధనవంతులున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఒకరు దేశంలోనే ఉంటూ మరింత ధనవంతులు అవుతుంటే, ఇంకొకరు మరింత సంపన్నులు కావటానికి దేశాన్ని వీడుతున్నారని చెప్తున్నారు.

Spread the love