– రూ.32,500 కోట్ల అంచనా వ్యయం
– తొమ్మిది రాష్ట్రాలు, 35 జిల్లాలు, 2,339 కిలో మీటర్ల రైల్వే నెట్‌వర్క్ విస్తరణ
– విశ్వకర్మ పథకానికి రూ.13 వేల కోట్లు
– పీఎం ఈ-బస్ సేవకు రూ.57,613 కోట్లు
– 169 పట్టణాల్లో 10 వేల ఈ-బస్సులు : కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు
న్యూఢిల్లీ : దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులను రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనుంది. బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌ను 2,339 కిలో మీటర్ల మేర విస్తరించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ పనులతో ఆయా రాష్ట్రాల్లోని కార్మికులకు 7.06 కోట్ల పనిదినాల మేర ఉపాధి అవకాశాలు అందుతాయని అన్నారు.ప్రధానంగా గుంటూరు – బిబి నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ.3,238 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. తద్వారా ఇక హైదరాబాద్ – చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ముద్కేడ్ – మేడ్చల్, మహబూబ్ నగర్ – డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. దీనివల్ల హైదరాబాద్-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం – చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.
విశ్వకర్మ పథకానికి రూ.13 వేల కోట్లు
ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ‘విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు మంజూరు చేయనున్నాం. గరిష్ఠంగా 5 శాతం వడ్డీరేటుతో ఈ రుణాలు పొందొచ్చు. ఇందుకోసం రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది’ అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ తరువాత పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు.
ఆ తరువాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ. 2 లక్షల రుణం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు (నాయీ వృత్తి దారులు), పడవల తయారీదారులు, ఆయుధ, కవచ తయారీదారులు, కమ్మరులు, సుత్తి, ఇంకా పరికరాల తయారీ దారులు, తాళాల తయారీదారులు, కుమ్మరు లు, శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసే టటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తిలో ఉండే వారు, చర్మకారులు, పాదరక్షల తయారీ దారులు, తాపీ పనివారు, గంపలు, చాపలు, చీపురులను తయారు చేసేవారు, కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువులను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూప కర్తలు), మాలలు అల్లే వారు, దర్జీలు, చేపలను పట్టేందుకు ఉపయోగించే వలలను తయారు చేసేవారి కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.
డిజిటల్ ఇండియాకు రూ.14,903 కోట్లు
డిజిటల్ ఇండియా పథకానికి రూ.14,903 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫేజ్ (ఐఎస్‌ఈఎ) ప్రోగ్రామ్ కింద 2.65 లక్షల మందికి శిక్షణ అందిస్తామన్నారు. ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణుల వృత్తి నైపుణ్యాలు మరింత మెరుగుదలకు కార్యక్రమాలు అమలుచేస్తామన్నారు. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (యూఎంఏన్జీ) యాప్/ ప్లాట్‌ఫారమ్ కింద 540 అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
దీంతో పాటు మరో 9 సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 1,787 విద్యాసంస్థలను అనుసంధానించి పనిచేస్తున్న నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఎన్‌కేఎన్)ను ఆధునీకరిస్తామన్నారు. డీజీ లాకర్ కింద డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సదుపాయం ఇకపై ఎంఎస్‌ఎంఈ, ఇతర సంస్థలకు అందుబాటులోకి వస్తుందనీ, టైర్ 2, 3 నగరాల్లో 1,200 స్టార్టప్‌లకు ప్రభుత్వం సహకారం అందిస్తుందనీ, ఆరోగ్యం, వ్యవసాయం సుస్థిర నగరాల అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 3 అత్యుత్తమ కేంద్రాలు ఏర్పాటుఅవుతాయని చెప్పారు.
12 కోట్ల మంది కళాశాల విద్యార్థులకు సైబర్-అవగాహన కోర్సులు అందిస్తామన్నారు. నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌తో 200కి మించి సైట్‌ల ఏకీకరణతో టూల్స్ అభివృద్ధి సహా సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త కార్యక్రమాలు అమలు జరుగుతాయని తెలిపారు.
పీఎం ఈ-బస్ సేవ కింద 10 వేల ఈ-బస్సులు
‘పీఎం ఈ-బస్ సేవ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10 వేల ఈ-బస్సులు అందు బాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో 169 పట్టణాల్లో ఈ బస్సులను నడపనున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడిం చారు. ఇందుకోసం రూ.57,613 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.20 వేల కోట్లను కేంద్ర ప్రభు త్వమే సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. 181 నగ రాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది.