ఫోన్‌ ట్యాపింగ్‌ హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం

Phone tapping destroys hard disks– నాగోల్‌ మూసీలో కంప్యూటర్ల పరికరాల ముక్కలు రికవరీ
– ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే.. ఫోన్‌ట్యాపింగ్‌ చేశామన్న భుజంగరావు, తిరుపతన్న
– వారిద్దరి కస్టడీ పూర్తి.. 6 వరకు రిమాండ్‌
– రాధాకిషన్‌రావు కస్టడీపై నేడు న్యాయమూర్తి నిర్ణయం
– మరో అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావుకు నోటీసులివ్వనున్న స్పెషల్‌ టీం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఉప ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఇచ్చిన విపక్షాలకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ చేసినట్టు అంగీకరించారు. ఈ మారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే తిరిగి వస్తుందనుకున్నామనీ, కానీ రాకపోవటంతో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్‌ 4న ఫోన్‌ట్యాపింగ్‌కు ఉపయోగించిన కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లను ముక్కలు చేసి, వాటిని నాగోల్‌ వద్ద మూసీ నదిలో పడేశామని భుజంగరావు, తిరుపతన్న ఒప్పుకున్నారు. ఈ మేరకు నాగోల్‌ మూసీ నది ఒడ్డు నుంచి ఐదు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ కవర్లను, ఆరు హార్డ్‌డిస్క్‌ ముక్కలను తాము స్వాధీనపర్చుకున్నట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారులు వివరించారు.
అలాగే, ఎస్‌ఐబీలోని ప్రణీత్‌రావు ఏర్పర్చుకున్న లాగ్‌రూంలో ధ్వంసం చేసిన కంప్యూటర్‌ అవశేషాలను ఆ పరిసరాల్లోనే సగం కాలిన డాక్యుమెంట్లను ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించినవి తాము స్వాధీనపర్చుకున్నట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. విపక్షాలకు చెందిన ఫోన్‌ నెంబర్లేగాక పలువురు ప్రయివేటు వ్యాపారులు, ప్రముఖ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్టు కూడా నరేశ్‌ అనే ఎస్‌ఐబీ కానిస్టేబుల్‌ను విచారించగా బయటపెట్టినట్టు ఈ రిపోర్ట్‌లో వివరించారు. తనతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లు పైఅధికారుల ఆదేశాల మేరకు ఫోన్‌ట్యాపింగ్‌ స్పెషల్‌ టీంలో పని చేసినట్టు నరేశ్‌ తెలిపాడు. అలాగే, ఈ టీంలో వరంగల్‌ రేంజ్‌కు చెందిన మరొక అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావు కూడా పాల్గొని ఫోన్‌ట్యాపింగ్‌ల వ్యవహారాన్ని ముందుకు నడిపించాడని భుజంగరావు, తిరుపతన్న అధికారులకు వివరించారు. దీంతో, వేణుగోపాల్‌రావుతో పాటు మరికొందరు అధికారులకు విచారణకు హాజరుకావాలని కోరుతూ 41 సీఆర్పీసీ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ కోసం మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును తమ కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి తన తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. మొత్తమ్మీద, ఒకవైపు పోలీసు అధికారుల నేరాన్ని ఈ కేసులో నిరూపించటానికి అవసరమైన ఆధారాలను సేకరిస్తున్న స్పెషల్‌ టీం అధికారులు.. మరోవైపు, ఫోన్‌ట్యాపింగ్‌లకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించిన అప్పటి బీఆర్‌ఎస్‌ నాయకులకు సంబంధించిన కూపీని జాగ్రత్తగా లాగుతున్నట్టు తెలిసింది. రాజకీయ ప్రముఖులపై తాము చేతులు వేసే ముందు దానికి తగ్గ ఆధారాలను పక్కాగా సేకరించి అడుగు వేయాలని ప్రస్తుత పొలిటికల్‌ బాస్‌ల నుంచి దర్యాప్తు అధికారులకు ఆదేశాలున్నట్టు తెలిసింది. ప్రధానంగా, ప్రభాకర్‌రావును అదుపులోకి తీసుకొని విచారించాకే.. అప్పటి రాజకీయ ప్రముఖుల పాత్ర గురించి ఒక అంచనాకు దర్యాప్తు అధికారులు వచ్చే అవకాశమున్నదని తెలిసింది.
భుజంగరావు, తిరుపతన్నకు ఈ నెల 6 వరకు రిమాండ్‌
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు ఈనెల 6వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధిస్తూ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు, గత ఐదు రోజులుగా వీరిద్దరినీ తమ కస్టడీలో ఉంచుకొని విచారించిన స్పెషల్‌టీం అధికారులు.. గడువు పూర్తి కావటంతో మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వారిద్దరికీ న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధించారు. కాగా, తాము స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారని కోర్టుకు సమర్పించిన వీరిద్దరి రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

Spread the love