ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు

With phone tapping No relationship– పార్టీల గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి…:
– ముఖ్యమంత్రి రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచన

– కాంగ్రెస్‌ సర్కారుకు నీటి నిర్వహణ చేతకాదంటూ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ముఖ్యమంత్రి రేవంత్‌… ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలపై అడ్డగోలు విమర్శలు చేయటంమాని, వాటర్‌ ట్యాపింగ్‌ (మంచి నీటి సరఫరా)పై దృష్టి సారిస్తే మంచిది…’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే నీటి నిర్వహణ చేతగాని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రిజర్వాయర్లలోని నీటిని వెంటనే వదిలి, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని ప్రజల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాగునీటికి తండ్లాట మొదలైందని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. దీంతో ప్రజల గొంతెండి పోతుంటే, సీఎం రేవంత్‌ గొంతు చించుకుని బూతులు తిడుతున్నారని విమర్శించారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలుపుతుంటే, ముఖ్యమంత్రి లంకెల బిందెల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్‌కు, జనానికి జలరాశులు తరలించే ఓపిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ప్రజల అవసరాలను ఎలా తీర్చాలనే అంశంపై దృష్టి సారిస్తే, ఇప్పటి కాంగ్రెస్‌ సర్కార్‌ మాత్రం చేరికలపై దృష్టి సారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తండాల నుంచి మొదలుకుని హైదరాబాద్‌ దాకా ఏ ఒక్క రోజూ తాగునీటికి ఇబ్బందులు రానివ్వలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మంచినీళ్లను మానవ హక్కుగా భావించిందని అన్నారు. అందుకే రూ.38 వేల కోట్లతో మిషన్‌ భగీరథను చేపట్టి, పూర్తి చేశామని వివరించారు. 50 ఏండ్లపాటు హైదరాబాద్‌కు తాగునీటి కొరత లేకుండా చేశామన్నారు. రేవంత్‌ సర్కార్‌కు ఆయా పథకాల నిర్వహణ కూడా సాధ్యం కావటం లేదని విమర్శించారు.
కేసీఆర్‌ పాలన ముగియగానే రాష్ట్రంలో ఇన్వెర్టర్లు, జనరేట్లతోపాటు వాటర్‌ ట్యాంకర్ల దందా మొదలైందని కేటీఆర్‌ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సాధారణ రేట్ల కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా డబ్బులు వెచ్చించి, ట్యాంకర్లను బుక్‌ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. గతేడాది సాధారణం కంటే 14 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని గుర్తు చేశారు. అయినా తాగునీటికి కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌, ఎల్లంపల్లి, హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లలో నీళ్లు ఉన్నా… ప్రజలు ట్యాంకర్లను బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేఆర్‌ఎమ్‌బీకి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించటం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. తాగునీటి కోసం ఇప్పుడు ఢిల్లీ వద్ద బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 75 శాతం పూర్తయిన సుంకిశాలను కాంగ్రెస్‌ సర్కార్‌ పక్కనబెట్టిందని విమర్శించారు. మరోవైపు కేసీఆర్‌ మీద రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. అది విఫలమైతే… హరీశ్‌రావు హెచ్చరికలతో ఇప్పుడు మళ్లీ అక్కడి పంప్‌ హౌస్‌లు ఎట్టా ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు.
హైదరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయలేదు కాబట్టే.. వారికి సీఎం రేవంత్‌ తాగు నీరివ్వకుండా కక్ష గట్టారని కేటీఆర్‌ విమర్శించారు. ట్యాంకర్‌ బుక్‌ చేసుకుంటే 12 గంటల్లో నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్న సీఎం… అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 2.30 లక్షల ట్యాంకర్లు బుక్కయ్యాయనీ, ఆ మేరకు ప్రజలపై భారం పడిందని చెప్పారు. ఆ భారాన్ని సీఎం భరిస్తారా..? లేక కాంగ్రెస్‌ భరిస్తుందా..? అని నిలదీశారు. ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న బెంగళూరులో నీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తున్నారనీ, మరి ప్రజల గొంతుల్ని ఎండబెట్టిన రేవంత్‌కు ఎన్ని జరిమానాలు వేయాలంటూ ప్రశ్నించారు. తక్షణమే రిజర్వాయర్లలోని నీటిని విడుదల చేసి, ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్‌ చేశారు. ట్యాంకర్లతో నీటిని ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ప్రజలకు నీటి బిల్లులు రాకుండా చూడాలనీ, బకాయిలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే జలమండలి ముందు ధర్నాలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ వివరణిచ్చారు. ఈ విషయమై అడ్డగోలుగా మాట్లాడితే… ముఖ్యమంత్రినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హీరోయిన్లను తాను బెదిరించినట్టు కొందరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారనీ, వారు తమ పద్ధతి మార్చుకోకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్‌, ఇతర పోలీసు విభాగాలకు సంబంధించిన అధికారులుగా శివధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రవిగుప్తా ఉన్నారని గుర్తు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఒక్క కేసీఆరే బాధ్యుడా..? ఈ అధికారులెవరు బాధ్యులు కాదా..? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… 2004 నుంచి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ ఫోన్లను ట్యాప్‌ చేశారంటూ ఆనాటి కాంగ్రెస్‌ నేతలే స్వయంగా ఆరోపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంతమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. దాదాపు రెండొందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నా సర్కారు పట్టటం లేదని వాపోయారు. సంబంధిత జాబితాను ప్రభుత్వానికి పంపుతామని వివరించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love