ఆత్మ విమర్శ తక్కువ.. పరనింద ఎక్కువ…

Less self-criticism.. Paraninda more...– లోపాలు, లొసుగులు, బలహీనతలపై అగ్రనేతల సమీక్ష నామమాత్రమే
– బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సన్నాహక సమావేశాల తీరిది
– అధిష్టానానికి మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చిన క్యాడర్‌
– ఎంపీ స్థానాలపై ముగిసిన భేటీలు
– అధినేత కేసీఆర్‌ వద్దకు రిపోర్టులు
– త్వరలోనే ముఖ్యులతో గులాబీ బాస్‌ భేటీ
– ఫిబ్రవరి మొదటి వారం నుంచి ‘అసెంబ్లీ’ సమీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌… ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవటంపై కాకుండా అధికార కాంగ్రెస్‌పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనబడుతోంది. ఈనెల మూడు నుంచి సోమవారం వరకూ మొత్తం 16 రోజులపాటు 17 ఎంపీ స్థానాలపై నిర్వహించిన సమీక్షా సమావేశాలు ‘ఆత్మ విమర్శ తక్కువ.. పరనింద ఎక్కువ…’ అనే రీతిలో సాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని, పార్లమెంటుపై దృష్టి పెట్టాలంటూ అగ్రనేతలు క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసినట్టు పైకి కనబడుతున్నా… కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలపైన్నే వారు తమ ఫోకసంతా పెట్టారు తప్పితే పార్టీ బలోపేతానికి నిర్దిష్ట కార్యాచరణ ఇవ్వలేకపోయారనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌ వంద రోజుల్లో అమలు చేస్తామన్న వాగ్దానాలపైన్నే బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావుల వాగ్బాణాలు కొనసాగాయి తప్ప పార్టీ నిర్మాణం, దాని బలోపేతంపై వారు లోతైన చర్చ చేయలేకపోయారంటూ పలువురు నేతలు బాహాటంగానే విమర్శించటం గమనార్హం. అయితే వివిధ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలు మాత్రం బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారనే చెప్పాలి. వారు లేవనెత్తిన అంశాలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక నేతలు తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా పదేండ్లుగా ప్రభుత్వంపైన పెట్టిన దృష్టి, పార్టీపై పెట్టలేదంటూ కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. క్యాడర్‌ను అస్సలు పట్టించుకోలేదనీ, కార్యకర్తలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్దిదారులకు అందజేయటం కూడా పార్టీకి తీరని నష్టం చేకూర్చిందనే విషయాన్ని పలు జిల్లాలకు చెందిన నేతలు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రజల్లో పార్టీకి కావాల్సినంత మైలేజీ రాలేదంటూ తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే కేంద్రంగా పార్టీ నడిచింది తప్ప పార్టీ కేంద్రంగా ఎమ్మెల్యేలు వ్యవహరించలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ముగ్గురిని కలిసిందే లేదు…
పదేండ్ల కాలంలో పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావును తాము కలిసిందే లేదని పలు నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు సైతం సమీక్షల సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కలిసేందుకు వస్తే అపాయింట్‌మెంట్లు దొరికేవి కావనీ, ఒకవేళ దొరికినా ఎమ్మెల్యేలు తమను కలవనీయకుండా అడ్డుకున్నారంటూ వారు వాపోయారు. దీంతో సొంత పార్టీ నాయకులే ఈసారి ఓడించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో నిర్మాణం, కమిటీలు, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయకపోవటం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టిందంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులు, అనుయాయులు, మాట వినేవారినే అన్ని రకాలుగా ప్రోత్సహించటంతో మిగతా క్యాడర్‌ నైరాశ్యంలో మునిగిపోయిందంటూ వారు తమ బాధను వ్యక్తం చేశారు.
‘తెలంగాణ’ పదమే లేకుండా చేశారు…
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చటం ద్వారా పార్టీ పేరులో తెలంగాణ పదమే లేకుండా చేశారంటూ సమీక్షల సందర్భంగా నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ గొంతుక, తెలంగాణ బలం, గళం, దళం మనమే’ అంటున్నప్పుడు అసలు పార్టీ పేరులోనే ఆ పదం లేకపోతే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారంటూ మహిళా నేతలు సైతం నిలదీశారు. అందువల్ల తక్షణమే బీఆర్‌ఎస్‌ పేరును ఉద్యమ పార్టీ అని చెప్పుకునేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌ అని మార్చాలంటూ పలువురు పట్టుబట్టారు. మరోవైపు సన్నాహక సమావేశాల్లో అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచినట్టు సమాచారం. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వంపై త్వరలోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది, రెండు మూడేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది…’ తదితర కామెంట్లు చేయకుండా ఉండాల్సిందంటూ సీనియర్లు హితవు పలికినట్టు తెలిసింది.
సర్దిచెప్పిన ఆ ఇద్దరు…
సన్నాహక సమావేశాల సందర్భంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను విని, వారి ఆవేదనను, ఆక్రందనను చవిచూసిన మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు క్యాడర్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తీవ్ర నైరాశ్యంలో, అంతకుమించిన ఆగ్రహంలో ఉన్న నేతలను శాంతింపజేసేందుకు వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామనీ, జిల్లాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను, అభిప్రాయాలను అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోతామంటూ వారు భరోసానిచ్చారు. పార్టీ నిర్మాణం, బలోపేతం, శిక్షణా తరగతులు తదితర హామీలనివ్వటం ద్వారా క్యాడర్‌లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు వారు ప్రయత్నించి, సఫలీకృతులయ్యారు.
సీనియర్ల సమన్వయం…
పార్లమెంటు సన్నాహక సమావేశాలన్నింటినీ సీనీయర్‌ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దగ్గరుండి నడిపించగా, మరో సీనియర్‌ రావుల చంద్రశేఖరరెడ్డి సమన్వయపరిచారు. ప్రతీ రోజూ జరిగిన రివ్యూ తాలూకూ రిపోర్టులను ఆ మరుసటి రోజు కేసీఆర్‌ వద్దకు పంపారు. ఆయన వాటన్నింటినీ పరిశీలించి, మంచి సూచనలు, సలహాలనిచ్చిన జిల్లా నేతలకు ఫోన్లు చేసి అభినందించినట్టు నేతలు తెలిపారు. త్వరలోనే పార్టీలోని సీనియర్లు, ముఖ్యులతో కేసీఆర్‌ భేటీ అయి ఎంపీ స్థానాలపై వచ్చిన రిపోర్టులపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.

Spread the love