కారు వెళ్లింది సర్వీసింగ్‌కే…షెడ్డుకు కాదు

The car went for servicing...not the shed– ఇంకో ఏడెనిమిది స్థానాలు మనం గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్‌ వచ్చేది
– బీఆర్‌ఎస్‌ను ఫినిష్‌ చేసేందుకు సహకరిస్తానంటూ మోడీ రేవంత్‌కు చెప్పారు : మల్కాజ్‌గిరి పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ పార్టీ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అతి తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లను కోల్పోయామని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కార్యకర్తలు కష్టపడి పని చేయడం ద్వారా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌ గిరి ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే సూచించారని తెలిపారు. వారి మాటలనే తాను గుర్తు చేశానని వివరించారు. దానిపై డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ, విధ్వంసకర మనస్థత్వమంటూ వ్యాఖ్యానించటం శోచనీయమన్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్థత్వమా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా తాను అదే మాటకు కట్టుబడి ఉన్నాననీ, జనవరి కరెంటు బిల్లులన్ని కాంగ్రెస్‌ అధినేత సోనియాకే పంపాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను సమాయాత్తం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని ప్రజాకోర్టులోనే ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు కలిసి తెలంగాణ గొంతుకైన బీఆర్‌ఎస్‌ను ఖతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ బండి సంజరు వ్యాఖ్యలు చూసినా, ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ రాధాకృష్ణ కొత్తపలుకు చూసినా ఇదే విషయం అర్థమవుతోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ను ఫినిష్‌ చేసేందుకు రేవంత్‌కు సహకరిస్తానంటూ ప్రధాని మోడీ చెప్పినట్టు రాధాకృష్ణ వివరించారని తెలిపారు. దీన్ని బట్టి బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేననే విషయం స్పష్టమవుతోందన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకెళదామని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. పటిష్ట నిర్మాణం ద్వారా బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలని కోరారు.

Spread the love