మా వాళ్లలో కనిపించని అర్హతలు కోదండరాంలో కనిపించాయా?

Qualities that are not seen in our people Seen in Kodandaram?– ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నవ్యక్తిని ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తారు..?
– మీరు రేవంత్‌కు బాధ్యులు కారు..
– ప్రజలకు బాధ్యులని గుర్తించుకోండి : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌పై కేటీఆర్‌ విమర్శలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్‌, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కుర్రా సత్యనారాయణలో కనిపించని అర్హతలు టీజేఎస్‌ అధ్యక్షునిగా ఉన్న కోదండరాంలో ఏం కనిపించాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని ప్రశ్నించారు. ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా నామినేట్‌ చేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. ప్రజలిచ్చే జీతంతో గవర్నర్‌ పని చేస్తున్నారనే విషయాన్ని ఆమె గుర్తించాలని హితవు పలికారు. గవర్నర్‌ రేవంత్‌ రెడ్డికి బాధ్యులు కారు.. ప్రజలకు బాధ్యులనే విషయాన్ని మర్చిపోరాదని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణకు రాజకీయ సంబంధాలున్నాయనే కారణంతో వారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తిరస్కరించారని గుర్తుచేశారు. కాని అదే రాజకీయ సంబంధాలున్న కోదండరాం అభ్యర్థిత్వాన్ని మాత్రం ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఫెవికాల్‌ బంధానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ప్రజల తరపున ఎన్నికైన సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతే తప్ప ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించవద్దని సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారాలు సరికావని అన్నారు. ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుని తరహాలోనే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సంయమనంతో, ఓపికతో వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్‌కు చేతనైతే ఎన్నికల్లో 420 హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
మాజీ హౌంమంత్రి మహమూద అలికి అస్వస్థత
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ హౌంమంత్రి మహమూద్‌ అలి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జెండావిష్కరణ సమయంలో తూలి కింద పడిపోయారు. అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి ఆయన ఆరోగ్యం కుదుటపడ్డట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Spread the love