– ప్రాణహిత, కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తాం
– సీసీఐ, చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాం
– జీవన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి
– బిడ్డ బెయిల్ కోసం ఐదు సీట్లు తాకట్టు పెట్టిన కేసీఆర్
– దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి.. రాముడి పేరుతో ఎన్నాళ్లు ఓట్లడుగుతారు? : ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ జనజాతర సభల్లో సీఎం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/నిజామాబాద్‌సిటీ/ హైదరాబాద్ సిటీ బ్యూరో
”ప్రధాని మోడీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం వెళ్లగక్కుతున్నారు.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు.. ఈ ప్రభుత్వం కూలిపోతే కోట్లాది మంది పేదలకు నష్టం జరుగుతుంది.. ప్రాణహిత, కుప్టి ప్రాజెక్టులు నిర్మిస్తాం.. సీసీఐని తెరిపిస్తాం.. సెప్టెంబర్ 17లోపు నిజామాబాద్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి కొట్టాం.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా అలాగే చేసి సాగనంపాలి..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభల్లో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిం చడంతోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మూతపడే ప్రమాదంలో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడి 50వేల మంది కార్మికుల కుటుంబాలను ఆదుకున్నామని చెప్పారు. తాము అమలు చేస్తున్న పథకాలను చూసి కడుపు మండిన మోడీ, కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టలేదని.. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.25,500కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని అంటున్నారని.. పదేండ్ల పాలనలో పథకాలు అమలు చేయని కేసీఆర్‌ను ఏం చేయాలో ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. కేసీఆర్‌ను గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బండకేసి కొట్టారని..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని అలాగే ఓడించాలని కోరారు. ప్రధాని మోడీ ప్రజలను మోసం చేశారని, బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించలేదని అన్నారు. గుజరాత్‌కు బుల్లెట్‌ప్రూఫ్ రైలు, సబర్మతికి రివర్‌ను తీసుకెళ్లారని విమర్శించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఆదరించాలని, ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని సీఎం అన్నారు. రూ.2లక్షల రుణమాఫీని త్వరలోనే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తామని.. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, అక్కడ 1900 ఎకరాల ముంపు పరిహారంపై ఒప్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు మళ్లీ డా.బీఆర్.అంబేద్కర్ పేరు పెడతామని హామీనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ప్రారంభిస్తామని, కుప్టి ప్రాజెక్టు నిర్మించి, సీసీఐని తెరిపిస్తామని చెప్పారు. వరిని చివరి గింజ వరకు కొనుగోలు చేసి రూ.500బోనస్ కూడా చెల్లిస్తామన్నారు. ఇంద్రవెల్లి అమరులకు ఇండ్లు, భూములు ఇచ్చామని, స్థూపాన్ని పర్యాటక క్షేత్రంగా మారుస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 17లోపు చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాం నిజామాబాద్ జనజాతర సభలో సీఎం హామీ
బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో సీఎం ఆరోపించారు. మూతపడిన బోధన్ చక్కెర ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తెరిపిస్తామని హామీనిచ్చారు. గత ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. పసుపు బోర్డును తీసుకురాకపోగా ”స్పైసెస్ ఎక్స్‌టెన్షన్”నే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నిజామాబాద్ రైతులు గమనిస్తూనే ఉన్నారని.. ఆ దెబ్బతోనే ప్రధానమంత్రితో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశామంటూ జీవోను విడుదల చేయించారని విమర్శించారు. అందులోనూ ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారో ఆ స్థలాన్ని, ఆ అంశాన్ని వివరించలేదని అన్నారు. రైతులకు అండగా ఉంటామని, అది ఇండియా కూటమితోనే సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి రైతుల సమస్యలు తెలిసిన రైతు నాయకుడని.. కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడితే జీవన్‌రెడ్డికి కేంద్ర వ్యవసాయ మంత్రిగా నియమించే బాధ్యత తను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో..
దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలని మల్కాజిగిరి జిల్లా అంతాయిపల్లి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాముడి పేరుతో ఎంత కాలం రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. తానూ హిందువునేనని, దేవున్ని నమ్ముతానని, ఎవరి ధర్మం, ఎవరి జాతి వారిదేనని, అందరినీ గౌరవించుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. దేవుడు, మతం పేరుతో వ్యాపారం చేసే వారిని ఊరి పొలిమేర దాక తరిమికొట్టి శాంతి, భద్రతలను కాపాడుతామని చెప్పారు. బిడ్డ కవిత బెయిల్ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఐదు పార్లమెంట్ సీట్లను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తొడు దొంగలేనని, ఇద్దరినీ రాజకీయంగా బొంద పెట్టాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతి, కాళేశ్వరం, హైదరాబాద్ భూముల అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఈటల రాజేందర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈటల రాజేందర్ కమ్యూనిస్టు మునుగులో మోడీ భజన చేస్తున్నారని విమర్శించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డి ని గెలిపించాలని కోరారు.
బీజేపీని ఓడించాలి : సీపీఐ నేత చాడ
రాజ్యాంగాన్ని మార్చుతామని.. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డికి మరింత బలం రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.