వాడవాడలా సీపీఐ(ఎం) ర్యాలీలు

CPI(M) rallies are frequent– భువనగిరి అభ్యర్థి జహంగీర్‌ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం
– బీజేపీ మూడోసారి అధికారంలోకొస్తే దేశాన్నే అమ్మేస్తుంది
– అవకాశవాద రాజకీయాలను తరిమికొట్టాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– ఎర్రజెండాకు పూర్వవైభవం : ముదిరెడ్డి
నవతెలంగాణ-మునుగోడు/చండూరు
పేదల పక్షపాతి, ఎర్రజెండా ముద్దుబిడ్డ.. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు కోరుతూ కార్యకర్తలు, నేతలు కళాకారుల బృందాలతో కలిసి వాడవాడలా జనాన్ని కదిలిస్తున్నారు.. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండా చరిత్రను పోరాటాల గడ్డపై పునరావృతం చేయడానికి కార్మికులు, కర్షకులు ప్రచారంలో ముందుకు కదులుతున్నారు. సోమవారం మునుగోడు, చండూరు మండలాల్లో ర్యాలీలుగా బయలుదేరి ఇంటింటికీ ప్రచారం చేశారు. జనంలో చైతన్యం తీసుకొచ్చేలా కళాకారుల ఆటపాటలతో ఆకట్టుకున్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్‌ శక్తులకు హోల్‌సేల్‌గా అమ్మేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. మునుగోడు, చండూరు మండలాల్లో నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పదేండ్లుగా బీజేపీ కార్మికులు, రైతు, పేదలకు వ్యతిరేకంగా విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌరహక్కులను కాపాడుకునేందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రజా సమస్యలను విస్మరించి అహంకారపూరితంగా వ్యవహరించిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అవకాశవాదులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని చెప్పారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ మాట్లాడుతూ.. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ వెనుకబాటుకు గత పాలకులే కారణమని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు, తాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో సీపీఐ(ఎం) కీలకపాత్ర పోషించిందని చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్‌ గతంలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలన్నారు. ప్రజా పోరాటాల ద్వారా నియోజకవర్గ సమగ్రాభివద్ధికి కషి చేస్తానని, తనకు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుంచడానికి నిరంతరం పని చేస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలపై పోరాడే తమను ఆశీర్వదించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎర్రజెండాకు పూర్వ వైభవం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గతంలో నవభారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love