ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే.. రాజీనామా చేస్తావా?

If the loan is not waived before August 15. Will you resign?– సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌
– రైతుబంధే పూర్తిగా ఇవ్వలేదు.. రుణమాఫీ ఎలా చేస్తారంటూ ఎద్దేవా
– రేవంత్‌రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కోతలు
– హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ను పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని పిలుపు
నవతెలంగాణ-కొండాపూర్‌
ఆగస్టు 15లోపు రూ.39వేల కోట్ల రైతు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్లేపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఇప్పటికీ రైతుబంధే పూర్తిగా ఇవ్వలేదని.. అలాంటిది ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. వారిచ్చిన గ్యారంటీలే పార్లమెంట్‌ ఎన్నికల్లో వారికి భస్మాసురహస్తం అవుతా యంటూ తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ఎందుకు ఓడించాలో ఒక్క కారణం చెప్పాలని, కాని కాంగ్రెస్‌ను ఓడించడానికి 100 కారణాలున్నాయన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్‌, ఆసరా పెన్షన్‌ పెంపు, మహిళలకు రూ.2500 సాయం, కళ్యాణలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పడం లాంటి ఎన్నో మోసాలు చేసిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి అంటేనే మాటల కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కోతలు అంటూ ఎద్దేవా చేశారు. నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు.. ఓటేయకపోతే పథకాలు బంద్‌ అవుతాయని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అంటే కరువు, కరెంట్‌ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని విమర్శించారు. కాబట్టి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love