తెలంగాణకు బీజేపీ ఏం చేసింది?

To Telangana What did the BJP do?– క్యాలెండర్లు, చిత్రపటాలేనా..
– ‘పాలమూరు- రంగారెడ్డి’కి జాతీయ హోదా హామీ ఏమైంది?
– రైతులను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ -కోస్గి
”తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చి విస్మరించారు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో క్యాలెండర్లు, చిత్ర పటాలు, చీరలు పంచుతున్నారని” అని మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి మధ్య తరగతి ప్రజల డొక్కలు ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక క్యాలెండర్లు, చిత్రపటాలు, చీరలు, బ్యాగులు పంచుతున్నారని ఎద్దేవా చేశారు.
కరివేనా రిజర్వాయర్‌ పూర్తయిందని, కాలువలు తవ్వితే కొడంగల్‌ నియోజకవర్గంలోని లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, మొదటి సంతకం ఆరు గ్యారంటీలపైనే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడ చేసిందని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ. 2500కు ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే రూ. 15 వేలు రైతుల ఖాతాలో జమవుతాయని చెప్పి విస్మరించారని అన్నారు. పింఛన్లు రూ.4000కు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగుల లాగా ఆడబిడ్డలకు ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.2500, నిరుద్యోగ భృతి రూ.4వేల హామీలు అమలుకు నోచుకోలేదన్నారు.
కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యాయి.. అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రూ. 90 వేల కోట్లతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ అందించామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్‌ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హకీంపేట, నల్లచెర్ల, ఎంకేపల్లి గ్రామాలలో ఫార్మాసిటీ కోసం రైతుల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని, తమ కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌ రూపురేఖలు మారుతాయని ఓట్లు వేసి రేవంత్‌ను గెలిపించారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌లో 50 వేల మెజారిటీ వస్తేనే రూ.5000 కోట్లు మంజూరు చేస్తానని, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఫార్మాసిటీ కళాశాలలు ప్రారంభమవుతాయని చెప్పడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్‌.రాజేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, అంజయ్య యాదవ్‌, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love