ఏడుపాయల సాక్షిగా.. మెదక్‌ బీఆర్‌ఎస్‌లో కొట్లాట

 As a witness of seven feet.. Clash in Medak BRS– ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి టార్గెట్‌గా ఆరోపణలు
– అవినీతి చేయలేదంటూ దేవేందర్‌రెడ్డి వివరణ
– రెబల్‌గా బరిలో ఉంటామంటున్న అసమ్మతి నేతలు
– అసమ్మతి నాయకులకు మైనంపల్లి అండదండలు
– వనదుర్గామాత సాక్షిగా ప్రమాణాల పరంపర
– వివాదానికి దారి తీసిన ఈవో అత్యుత్సాహం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
”పసుపు బట్టలతో వనదుర్గమ్మ ముందు ప్రమాణం చేసి చెబుతున్నం. దేవేందర్‌రెడ్డి చేసిన పలు అవినీతికి సంబంధించిన ఆధారాలను దుర్గమ్మ ముందు పెట్టాం.. ఇక అంతా అమ్మే చూసుకోవాలి.. ఏడుపాయల దుర్గమ్మ బంగారం విషయంలో అవినీతి జరిగింది. ఈవో శ్రీనివాస్‌ను దేవేందర్‌రెడ్డి కాపాడుతున్నారు. భూ ఆక్రమణలు చేశారు. మెదక్‌ అభ్యర్థి విషయంలో సీఎం పునరాలోచన చేయాలి. మేం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతం. మాలో ఒకరు రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తం” ఇదీ..! బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల హెచ్చరికలు..
”నదిలో తడిబట్ట స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్న. నేను పైసా అవినీతి చేయలే. ఏడుపాయల ఈఓ విషయంలో నేనెందుకు వెనకేసుకొస్తా.. బంగారం విషయం నాకు తెల్వదు. నేను అవినీతికి పాల్పడుతున్నట్టు ఓ ఉన్నతాధికారి సీఎంకు నివేదిక ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేశారు. అది అబద్ధం. సోషల్‌ సర్వీస్‌ పేర చేసేది చారాణ.. చెప్పుకునేది భారాణ.. మేమూ సర్వీస్‌ చేస్తున్నాం. ఎక్కడా చెప్పుకోం. నా పై కుట్రతోనే తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు. వీటిని ప్రజలు గమనిస్తున్నారు” ఇదీ.. దేవేందర్‌రెడ్డి చేసిన ప్రమాణం.
బీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాల తంతు ముదిరిపాకాన పడింది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మకు మూడోసారి టికెట్‌ ఇవ్వడంతో ఆ పార్టీలోని కొందరు నాయకులు సీఎం జాబితా ప్రకటించిన రోజు నుంచే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసమ్మతి గళం వినిపిస్తున్న నాయకులంతా ఏడాది క్రితం వరకు పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అనుచరులుగా పనిచేశారు. నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్‌ సేవా కార్యక్రమాల పేరిట ఎంట్రీ ఇవ్వడంతో పద్మాదేవేందర్‌రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులంతా మైనంపల్లికి దగ్గరయ్యారు. మైనంపల్లి రోహిత్‌కే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. సీఎం మాత్రం పద్మకే టికెట్‌ ప్రకటించడంతో అసమ్మతి గ్రూపు మరింత దూరమైంది. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మైనంపల్లి ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.
కొట్లాటకు వేదికైన ఏడుపాయల దేవాలయం
మెదక్‌ పట్టణ సమీపంలో ఉన్న ఏడుపాయల వనదుర్గాభవానీ దేవాలయం కేంద్రంగా బీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపుల మధ్య కొట్లాట నడుస్తోంది. దేవాలయానికి సంబంధించిన రూ.2 కోట్ల విలువైన బంగారం, 100 కిలోల వెండి హుండీలో భక్తులు వేశారు. రెండేండ్ల క్రితం హుండీలో వేసిన ఆభరణాలను కరిగించేందుకు తరలించిన విషయం వివాదంగా మారింది. ఈవో శ్రీనివాసరావు పాలక మండలికి చెప్పకుండా తరలించడం, బ్యాంకు సమయం దాటిపోవడంతో తన ఇంటికి తీసుకెళ్లడంతో ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బంగారం, వెండి ఆభరణాల విషయంలో తప్పు జరిగినట్టు నిర్దారణ కాకపోయినా దాన్ని ఆసరా చేసుకుని బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నాయకులు ఈవోపై ఆరోపణలు చేశారు. దేవాలయంలో పనులు చేయకున్నా బిల్లులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తూనే ఈవోకు ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డికి లింకు పెడుతూ ఆరోపణలు చేశారు. సీఎం ఆఫీస్‌ నుంచి పైరవీ చేసి ఈవోను దేవేందర్‌రెడ్డి కాపాడుకొస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేవేందర్‌రెడ్డి అవినీతి చేయలేదని నిరూపించుకునేందుకు అమ్మవారి వద్దకొచ్చి ప్రమాణం చేసి చెప్పాలని సవాల్‌ విసిరారు. సవాల్‌ను స్వీకరించిన దేవేందర్‌రెడ్డి.. ఏడుపాయల నదిలో స్నానం చేసి దేవాలయంలో పూజలు చేశారు. ప్రమాణ పూర్వకంగా తాను ఎలాంటి అవినీతి చేయలేదనీ, దేవాలయ ఆభరణాల గురించి తెల్వదనీ ప్రకటించారు. దేవాలయం పెద్దది అయినందున అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి ఈవో కావాలని తానే పాలక మండలికి చెప్పి తీర్మానం చేయించి దేవాదాయ శాఖలో ఇచ్చినట్టు తెలిపారు. ఏసీ స్థాయి అధికారి రావాలని కోరిన తాను.. ఈఓను ఎందుకు కాపాడుతానని స్పష్టం చేశారు. ఆ తర్వాత అసమ్మతి నాయకులు వందలాది మంది మద్దతుదారులతో దేవాలయం వద్దకు చేరుకున్నారు. పసుపు బట్టలు ధరించి అమ్మవారి ముందు దేవేందర్‌రెడ్డి చేసిన అవినీతికి సంబంధించిన కొన్ని ఆధారాలంటూ అక్కడ పెట్టారు. ఆయన సంగతి అమ్మవారే చూసుకుంటారంటూ సవాళ్లు విసిరారు. పద్మను మార్చకపోతే తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ రెబల్‌గా పోటీ చేస్తామని ప్రకటించారు.
మైనంపల్లి వర్సెస్‌ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య వార్‌ నడుస్తోంది. ఇద్దరూ మెదక్‌కు చెందిన నాయకులే. ఒకే పార్టీలో వేర్వేరు జిల్లాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి తన కొడుకు రోహిత్‌క్‌ టికెట్‌ ఇవ్వాలని హన్మంతరావు పట్టుపట్టారు. సీఎం మాత్రం పద్మకే టికెట్‌ ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు చేసిన మైనంపల్లి ప్రస్తుతం దేవేందర్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. ఆయన అనుచరులతో అసమ్మతి గళం వినిపిస్తూనే దేవేందర్‌రెడ్డి అవినీతి పరుడంటూ పలు ఆరోపణలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే భర్తపై అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో నియోజకర్గంలోని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయోమయానికి గురవుతున్నారు.
అసమ్మతి నాయకులంతాద ఒకప్పుడు దేవేందర్‌రెడ్డి అనుచరులే
మెదక్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో అసమ్మతి గళం వినిపిస్తున్న అసమ్మతి నాయకులంతా గతంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అనుచరులే కావడం విశేషం. ఎమ్మెల్యే పీఆర్‌ఓగా చేసిన అడ్వకేట్‌ జీవన్‌రావు, పాపన్నపేట ఎంపీపీ ప్రశాంత్‌రెడ్డి, చిన్న శంకరంపేట సర్పంచ్‌ రాజిరెడ్డి, రామాయంపేట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ గంగా నరేందర్‌ మరికొందరు చాలా కాలం పాటు పద్మదేవేందర్‌రెడ్డి అనుచరులుగా ఉన్నారు. పదవులు, కాంట్రాక్టులు, భూముల వ్యవహారాల్లో తేడాలు రావడంతో వీరంతా ఒక్కొక్కరుగా దేవేందర్‌రెడ్డికి దూరమవుతూ వచ్చారని తెలిసింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కాదని బయటపడలేదు. మైనంపల్లి రోహిత్‌ నియోజకవర్గంపై కేంద్రీకరించి పనిచేయడంతో అసంతృప్తితో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా దేవేందర్‌రెడ్డికి దూరమయ్యారు. కోనాపూర్‌ సొసైటీలో రూ.2.50 కోట్ల అవినీతి జరిగిందని, చిన్న శంకరంపేటలో భూముల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ దేవేందర్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ఏడుపాయల ఆభరణాల వ్యవహారంతో మరింత రచ్చ రచ్చ అయ్యింది.

Spread the love