– కాంగ్రెస్ వైపు అసంతృప్తుల చూపు
– రేవంత్‌తో మైనంపల్లి చర్చలు..!
– బీఆర్‌ఎస్‌కు వేముల వీరేశం, సంతోష్, జైపాల్‌రెడ్డి గుడ్‌బై
– కమలాన్ని వీడి కాంగ్రెస్‌లోకి వినరురెడ్డి
– మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డితో మల్లు రవి భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాదబాద్
బీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆపార్టీలో అలకలు, అసంతృప్తులు పెరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానంపై బాణాలు ఎక్కుపెడుతున్న అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒకేరోజు ఏకంగా ముగ్గురు నేతలు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కారులో చోటు దక్కకపోవడం, అధిష్టానం తీరు నచ్చకపోవడం వంటి కారణాలతో ఆ పార్టీకి పలువురు రాజీనామా చేస్తున్నారు. అందుకే వారు కారు దిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రెండు రోజులు క్రితం మంత్రి హరీశ్‌రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అధిష్టానం వేటుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. మల్కాజిగిరి టికెట్‌తోపాటు కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి విజ్ఞప్తిని బీఆర్‌ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి హరీశ్‌రావు తన కుమారుడికి టికెటు రాకుండా అడ్డుకున్నారనే సమాచారంతో మైనంపల్లి రగిలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం వైపు చూస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆయనతో రేవంత్‌రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. మెదక్ పార్లమెంటు స్థానంతోపాటు మల్కాజిగిరి అసెంబ్లీస్థానాన్ని మైనంపల్లి అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని పార్టీ నేతలు చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ కూడా కారు దిగారు. మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదే జిల్లాకు చెందిన మరో నేత, మైత్రి గ్రూప్ చైర్మెన్ కొత్త జైపాల్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిద్దరూ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చలేమనీ, పార్టీలో చేరిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని రేవంత్ అన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ పరిణామాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈనెల 24న జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు మూహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. బుధవారం తన అనుచరులతో చర్చించిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయనతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈక్రమంలో వేముల రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత వినరుకుమార్‌రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ అర్వింద్‌కుమార్ ఏకపక్ష దోరణికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆయన…కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతా దయాకర్‌రెడ్డితో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుధవారం భేటీ అయ్యారు. ఆమెను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవల ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.