ద్వైపాక్షిక సంబంధాలను పరిపుష్టం చేస్తాం..

We will strengthen bilateral relations.– బ్రిక్స్‌ సదస్సులో మోడీ
జోహాన్నెస్‌బర్గ్‌ : 15వ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్‌ రమాఫోసాతో భేటీ అయ్యారు. బ్రిక్స్‌ సదస్సుకు ముందుగానే వీరి సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లోని పురోగతి గురించి సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గల పేద దేశాల వాణిని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేయడానికి గల మార్గాలను కూడా వారు చర్చించారు. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సంరక్షణ, ప్రజల మధ్య సంబంధాలుతో సహా వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని నేతలు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పరం ప్రయోజనాలు కలిగిన అంశాలతో సహా బహుళ అంతర్జాతీయ వేదికలపై సమన్వయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్‌కు పూర్తి మద్దతును దక్షిణాఫ్రికా నేత ప్రకటించారు. జి-20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు పూర్తి స్థాయి సభ్యత్వానికి భారత్‌ చేపట్టిన చొరవను స్వాగతించారు. సెప్టెంబరు 8-10 తేదీల్లో భారత్‌లో మొదటిసారిగా జి-20 సదస్సు జరగనుంది.
భారత్‌-దక్షిణాఫ్రికా సంబంధాలను మరింత పరిపుష్టం చేసే విస్తృతాంశాలను చర్చించామని, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు సాగాయని మోడీ ట్వీట్‌ చేశారు. సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

Spread the love