22న మోడీ వ్యతిరేక నిరసన ప్రదర్శన

– అమెరికా హక్కుల సంఘాల యోచన
– వాషింగ్టన్‌లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
– న్యూయార్క్‌లో ‘హౌడీ డెమొక్రసీ’ కార్యక్రమం
వాషింగ్టన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బైడెన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే పలు హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. వెటరన్స్‌ ఫర్‌ పీస్‌, ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, బెథెస్డా ఆఫ్రికన్‌ సెమెటరీ కొయలేషన్‌ వంటి పలు సంస్థలు ఈ నెల 22న అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో ప్రదర్శనలకు సమాయత్తమవుతున్నాయి. అదే సమయంలో మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మధ్య శ్వేతసౌధంలో చర్చలు జరుగుతాయని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థలు వాషింగ్టన్‌లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నాయి. ఈ ప్రదర్శనకు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, విశ్లేషకులను ఆహ్వానించారు. మోడీ ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్‌లో జరిగిన మతోన్మాద హింసాకాండపై బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఉన్న ఈ డాక్యుమెంటరీని మోడీ ప్రభుత్వం నిషేధించింది. ‘మోడీ…మీకు ఆహ్వానం లేదు’, ‘హిందూ మతోన్మాదుల ఆధిపత్యం నుండి భారత్‌ను కాపాడండి’ వంటి నినాదాలు రాసిన ప్లకార్డులతో నిరసన చేపట్టాలని హక్కుల సంఘాలు నిర్ణయించాయి.
అంతేకాక న్యూయార్క్‌ నగరంలో ‘హౌడీ డెమొక్రసీ’ పేరిట ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. 2019లో మోడీ అమెరికాలో పర్యటించి నప్పుడు టాక్సాస్‌ నగరంలో మోడీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంయుక్తంగా ‘హౌడీ మోడీ’ పేరిట ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దానిని గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
మానవ హక్కుల ప్రస్తావన ఉండదా?
మోడీ పర్యటన సందర్భంగా భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేయాల్సిందిగా కోరుతూ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఆసియా విభాగం డైరెక్టర్‌ ఎలైన్‌ పియర్సన్‌ దేశాధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. అయితే మోడీ, బైడెన్‌ మధ్య జరిగే చర్చలలో ఈ అంశం ప్రస్తావనకు రాకపోవచ్చునని విశ్లేషకులు తెలిపారు. మోడీ పర్యటన విజయవంతం కావాలని రెండు దేశాలు కోరుకుంటున్న నేపథ్యంలో మానవ హక్కులపై ఇద్దరు నేతలు దృష్టి సారించకపోవచ్చునని వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన కేంద్రానికి చెందిన విదేశాంగ శాఖ మాజీ అధికారి డొనాల్డ్‌ క్యాంప్‌ చెప్పారు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పు కోవాలని అమెరికా భావిస్తోంది. అందువల్ల చర్చలలో మానవ హక్కుల అంశాల కంటే భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్‌లో మానవ హక్కుల పరిస్థితిపై అమెరికా తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వం మైనారిటీలు, అసమ్మతివాదులు, పాత్రికేయలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయినప్పటికీ మోడీ, బైడెన్‌ చర్చలలో ఈ అంశాలేవీ ప్రస్తావనకు రాకపోవచ్చు. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్‌ స్థానం 140 నుండి 161కి పడిపోయింది. ఇంత కనిష్ట స్థాయికి భారత ర్యాంకింగ్‌ ఏనాడూ దిగజారలేదు. వరుసగా ఐదేళ్ల పాటు అంతర్జాతీయంగా మూసివేతకు గురైన ఇంటర్నెట్‌ సంస్థల సంఖ్యను పరిశీలిస్తే భారత్‌లోనే అలాంటి ఉదంతాలు ఎక్కువ సంఖ్యలో జరిగాయి. 2019వ సంవత్సరపు భారత పౌరసత్వ చట్టం వివక్షాపూరితంగా ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అభివర్ణించింది. ఆ చట్టంలో ముస్లిం వలసవాదుల ప్రస్తావనే లేదని గుర్తు చేసింది. అంతేకాక ప్రజలు తమకు నచ్చిన మత విశ్వాసాలను అనుసరించవచ్చునంటూ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను మత మార్పిడుల నిరోధక చట్టం నీరుకార్చిందని ఆ కార్యాలయం తెలిపింది.
జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను సైతం 2019లో తొలగించారని విమర్శించింది. అయితే ఈ అంశాలేవీ మోడీ, బైడెన్‌ చర్చలలో చోటు చేసుకునే అవకాశమే కన్పించడం లేదు.

Spread the love