ఆహార భద్రత, ఆరోగ్య రక్షణపై దృష్టి జి7 దేశాధినేతలను కోరిన ప్రధాని మోడీ

 సవాళ్ల పరిష్కారానికి పది పాయింట్లతో ప్రతిపాదన
 పలు దేశాధినేతలతో భేటీ
టోక్యో : ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని, వినియోగదారి తత్వంతో కాకుండా వర్ధమాన దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి నమూనాలను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జి-7 శిఖరాగ్ర సదస్సులో ‘బహుళ సంక్షోభాల పరిష్కారానికి కలిసికట్టుగా పని చేద్దాం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఆహారం, ఆరోగ్యం, అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి మోడీ పది పాయింట్ల కార్యాచరణను ప్రతిపాదించారు. ట్రాన్స్‌జెండర్ల వ్యక్తిగత హక్కులను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సన్నకారు రైతులతో సహా నిస్సాహయక ప్రజలను రక్షించుకునేందుకు సమగ్ర ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. తృణధాన్యాల వినియోగాన్ని పెంపొందించాలని, దీనివల్ల పోషకాహర సవాళ్లను అధిగమించడమే కాకుండా పర్యావరణ ప్రయోజనాలూ చేకూరుతాయ న్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే ఆహార వృథాను అరికట్టాలని హితవు పలికారు. ప్రపంచ ఎరువుల సరఫరా వ్యవస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చేయాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్య రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, అధ్యాత్మిక, సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలని విన్నవించారు. అదే సమయంలో డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందుబాటులోకి తీసుకురావాల్సిన అసరముందని తెలిపారు.
మహాత్మగాంధీ విగ్రహావిష్కరణ
జి7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శనివారం ఉదయం జపాన్‌ చేరుకున్న ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని ఫ్యూమియో కిసిందాతో సమావేశమయ్యారు. భారత్‌, జపాన్‌ మధ్య దైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం హిరోషిమాలో నెలకొల్పిన మహాత్మగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Spread the love