గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి

Wall rent Three laborers died– నిర్మాణంలో ఉన్న భవనంలో ఘటన..
– మరో ఘటనలో..భవనం పై నుంచి పడి బాలుడు మృతి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/ కుత్బుల్లాపూర్‌
నిర్మాణంలో ఉన్న భవనం ఆరో అంతస్థుపై ఉన్న గోడ కూలడంతో కిందపడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదర్‌నగర్‌ డివిజన్‌ అడ్డగుట్టలో దాసరి సంతోష్‌, దాసరి శ్రీరామ్‌ సర్వే నెంబర్‌ 176పీ, 177పీ, 188పీలోని 668 గజాలలో భవనం నిర్మాణం చేపట్టారు. కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ అధికారులు స్టిల్ట్‌ ప్లస్‌ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే, అనుమతులు లేకుండా ఆరో అంతస్థు కూడా నిర్మించారు. ఈ క్రమంలో స్లాబు పైన ప్రహారీ కడుతున్న క్రమంలో గురువారం పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీలపై కూలింది. దాంతో ఐదుగురు కూలీలు కిందకు పడిపోయారు. ఈ ఘటనలో సంతోష్‌(23), సోనీ(19) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా సోనియా బడ్నాయక్‌(18) చనిపోయాడు. మిగతా ఇద్దరు బలరాం, బుధ బడ్నాయక్‌లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేేపీహెచ్‌బీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థలానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బు సంపాదన యావలో పడి అనుమతులకు మించి భవన నిర్మాణాలు చేపడుతున్న వారి పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మరో ఘటనలో బాలుడు..
3వ అంతస్థుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాసూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సూరారం రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉంటున్న కనకరత్నం కుమారుడు తులసినాథ్‌(10) సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం కృష్ణాష్టమి సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉన్న బాలుడు స్నేహితులతో కలిసి 29వ బ్లాక్‌ 3వ అంతస్థులో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో సూరారం రాజీవ్‌ గృహకల్పలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సూరారం పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Spread the love