– మణిపూర్ హింస,అవినీతిని కప్పిపుచ్చుకోవటానికే..: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
– ప్రధాని తెలిసే మాట్లాడుతున్నారా..?: సీఎం స్టాలిన్
చెన్నై : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. బీజేపీ నేతలు తనపై దాఖలు చేస్తున్న కేసులు, ఫిర్యాదులను న్యాయపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. తనపై కాషాయ నేతల ఎదురుదాడి, కేసుల నమోదును ప్రస్తావిస్తూ బీజేపీ నేతల మనుగడ ఇదేనని, వారికి ఎలా ప్రజల్లో ఉండాలో తెలియదని మండిపడ్డారు. తన తలపై రివార్డు ప్రకటించిన అయోధ్య ప్రధాన పూజారి ఉదంతంపై స్పందిస్తూ స్వామీజీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి చేయవద్దని డీఎంకే శ్రేణులను ఉదయనిధి స్టాలిన్ కోరారు. తనపై నమోదైన కేసులను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, 7.5 లక్షల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోడీతో పాటు మోడీ బృందం సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేండ్లుగా చేసిందేమీ లేదు. కరెన్సీ నోట్ల ఉపసంహరణ, గుడిసెలు కనిపించకుండా గోడలు కట్టడం, నూతన పార్లమెంట్ భవనం నిర్మించడం, దేశం పేరు మార్పుపై హంగామా చేయడం మినహా మోడీ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఉదయనిధి స్టాలిన్ దుయ్యబట్టారు.
తెలుసుకోకుండా పీఎం మాట్లాడటం తగదు. సీఎం స్టాలిన్
”సనాతన ధర్మం”పై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం సమర్థించారు. ఏ మతాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం తన కుమారునికి లేదని అన్నారు. సనాతన ధర్మం పేరిట బోధించే అమానవీయ సూత్రాలు.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు , మహిళల పట్ల చూపుతున్న వివక్షను గురించి మాత్రమే ఉదయనిధి వ్యాఖ్యానించారని అన్నారు. కొంతమంది కులం పేరుతో వివక్షను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని విమర్శించారు. ఈ అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా ఉదయనిధి వైఖరిని బీజేపీ అనుకూల శక్తులు సహించలేకపోతున్నాయని, దీంతో ఆయన ప్రసంగంపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
” మనం చంద్రునిపై చంద్రయాన్‌ను ప్రయోగించినప్పటికీ.. కొందరు సనాతన ధర్మం పేరుతో స్త్రీలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. ఉదయనిధి ఇటువంటి అణచివేత భావజాలానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు. ఆ సిద్ధాంతాల పేరుతో నిర్వహించే ఆచారాల నిర్మూలనకు పిలుపునిచ్చారు” అని స్టాలిన్ అన్నారు. సనాతన వివక్ష పట్ల బీజేపీకి పట్టింపు లేదని ఆయన అన్నారు. యూపీకి చెందిన ఓ మత గురువు తన కుమారుడి తలపై రూ.10 కోట్ల బహుమతి ప్రకటించంపై ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోకుండా .. తనకుమారునిపై కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని.. ఉదయనిధి తమిళంలో కానీ ఇంగ్లీషులో కానీ ”జాతి హత్య” అనే పదాన్ని వినియోగించలేదని, అయినప్పటికీ బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని పేర్కొనడం నిరుత్సాహపరిచిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఏదైనా నివేదికను తెలుసుకుని, ధ్రువీకరించుకోవడానికి ప్రధాన మంత్రికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయని.. కానీ ఉదయనిధి గురించి తప్పుగా చేయబడుతున్న ప్రచారం గురించి ప్రధానికి తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..? అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనేది రాజకీయ జిమ్మిక్కు అని, ప్రతిపక్ష కూటమిలో విభేదాలు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.