కేసీఆర్‌ వ్యూహానికి విపక్షాలు కకావికలం

KCR's strategy is scorned by the opposition– ఏ రాజకీయ పార్టీ ఇంత మంది అభ్యర్థులను ప్రకటించలేదు
– మెదక్‌ వేదికగా ప్రగతి శంఖారావం పూరించనున్న సీఎం కేసీఆర్‌
– ఉమ్మడి మెదక్‌లో పదికి పదిసీట్లు గెలిచి సీఎంకు బహుమతి ఇస్తాం
– నేటి మెదక్‌ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలి :ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్‌
సీఎం కేసీఆర్‌ వ్యూహానికి విపక్షాలు కకావికలం అయిపోయాయని, ఏ రాజకీయ పార్టీ ఇంత మంది అభ్యర్థులను ప్రకటించిన దాఖలాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డితో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని బుధవారం సీఎం ప్రారంభించనున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రాధాన్యత ఉందని, మెదక్‌ సభా వేదికగా సీఎం ప్రగతి శంఖారావం పూరించబోతున్నట్టు తెలిపారు. మెదక్‌ సభ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది దివ్యాంగులకు పెంచిన రూ.4,016 పింఛన్‌ పెంపు, బీడీ కార్మికులు, టేకేదార్లు, ప్యాకర్స్‌కు సైతం ఆసరా పింఛన్‌ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనుండగా, రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యక్రమాన్ని ఏకకాలంలో కొనసాగించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి మెదక్‌లో పదికి పది సీట్లు గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ తరహా స్కీమ్‌లు కావాలని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అడుగుతున్నారన్నారు. జిల్లాలో బీజేపీకి క్యాడర్‌ లేక ఢలాీ పడితే, కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేక ఉత్తుత్తి గోల చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆరోపించారు. దుష్ప్రచారంతో ప్రజల మనసు గెలుస్తామని అనుకోవడం భ్రమ మాత్రమేనని వ్యాఖ్యానించారు. దశాబ్దాల మెదక్‌ కలను కేసీఆర్‌ నెరవేర్చారని, ఎస్పీ, కలెక్టరేట్‌, 14 చెక్‌ డ్యామ్‌, రైల్వే, రూ.100 కోట్లతో ఘనపూర్‌ ఆనకట్ట, 4 లైన్‌ రోడ్డు, కాళేశ్వరం జలాలు, ఏడుపాయల అభివృద్ది చేసుకోవడం జరిగిందన్నారు. మెదక్‌ జిల్లాపై కేసీఆర్‌కు ప్రేమ ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సీఎంను ఆశీర్వదించాలని కోరారు.
రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్‌ మెదక్‌ రాక
రోడ్డు మార్గంలో హైదరాబాద్‌, పటాన్‌ చెరువు, గుమ్మడిదల, నర్సాపూర్‌, కౌడిపల్లి మీదుగా సీఎం కేసీఆర్‌ మెదక్‌ పట్టణానికి రానున్నట్టు తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మైపాల్‌రెడ్డి గుమ్మడిదల వద్ద స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. మెదక్‌ పట్టణానికి మధ్యాహ్నం 1 గంటలకు చేరుకొని మొదటగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని, తర్వాత 1.20 గంటలకు ఎస్పీ కార్యాలయం, 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రసంగం, అనంతరం భోజనం విరామం తరువాత మధ్యాహ్నం 3.30లకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారన్నారు.

Spread the love