ప్రపంచ క్రమాన్ని మార్చే దిశగా… బ్రిక్స్‌

Towards changing the world order... BRICSనెల్లూరు నరసింహారావు
దక్షిణాఫ్రికా రాజధాని జొహాన్నెస్‌బర్గ్‌లో ఆగస్టు 22-24 తేదీల్లో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. 2009లో రష్యాలోని ఎకాటరిన్‌ బర్గ్‌లో ఐదు దేశాల సభ్యత్వంతో మొట్ట మొదటి సమావేశం జరిగింది. 15వ బ్రిక్స్‌ దేశా ధినేతల సమావేశం మంగళవారం నుంచి జరుగు తున్నది. బ్రిక్స్‌లో చేరేందుకు 40దేశాలకుపైగా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలను ప్రధానంగా గుర్తించాలి. ప్రపంచం ఎలా నడవాలనే విషయంలో భాగస్వామ్యం కోసం అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలకు సమాంతరంగా ఇతర దేశాలు కూడా ఆకాంక్షిస్తున్నాయనేది మొదటి ది. ప్రపంచ రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ఫైనాన్స్‌, మీడియాల మీద పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఆలోచన రెండవది.
అయితే బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ఆఫ్రికా దేశాలతో ప్రారంభమై బ్రిక్స్‌ ప్రమేయం తో ప్రపంచ క్రమం(వరల్డ్‌ ఆర్డర్‌) రాత్రికి రాత్రే మారిపోతుందని కాదు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు బ్రిక్స్‌ పరిణామానికి రెండు సవాళ్ళు ఎదురవుతున్నాయి. మొదటిది సభ్యత్వ విస్తరణ. బ్రిక్స్‌లో చేరటానికి యావత్‌ ప్రపంచ దేశాలు క్యూలో నిలుచున్నాయి. ఇలా బ్రిక్స్‌లో సభ్యత్వాన్ని ఆశిస్తున్న దేశాల్లో అల్జీరియా, అర్జంటీనా, బంగ్లాదేశ్‌, బెలారస్‌, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ద కాంగో, క్యూబా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్‌, ఖజకిస్తాన్‌, మెక్సికో, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి. ఇలా పెద్ద ఎత్తున్న జరగనున్న బ్రిక్స్‌ విస్తరణ అమెరికా నేతృత్వంలోని కూటములకు, భాగస్వామ్యాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నదన్నది స్పష్టం.
అయితే ఇంత విభిన్నంగా విస్తృతీకరింప బడుతున్న బ్రిక్స్‌ తక్షణమే బలోపేతం అవగలదా అనే ప్రశ్న ఎదురవుతున్నది. ఇలా విస్తృతీకరించటంపైన బ్రిక్స్‌ దేశాల్లో బిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో షాంగై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) అనుభవం ఉపయోగపడొచ్చు. ఈ గ్రూపును రష్యా, చైనాలతోపాటు మూడు మధ్య ఆసియా దేశాలు ప్రారంభించాయి.
అనతికాలంలోనే వివిధ దేశాలను చేర్చుకునేందుకు అవసరమైన నియమాల ను, ప్రక్రియను రూపొందించుకున్నాయి. దాని ప్రతిపదికనే ఇండియా, పాకిస్తాన్‌, ఉజ్బకిస్తాన్‌, ఇరాన్‌లకు సభ్యత్వాన్ని ఇవ్వటం జరిగింది.
అమెరికన్‌ డాలర్‌ పైన ఆధారపడటాన్ని తగ్గించే ఫైనాన్సియల్‌ సాధనాలను రూపొందించటం బ్రిక్స్‌ ముందున్న మరో సమస్య. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో ఒక పరోక్ష యుద్ధాన్ని నడుపుతూ అమెరికా తన కరెన్సీని ఆయుధంగా మార్చటం, చైనాకు వ్యతిరేకంగా వాణిజ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతికూలం చేయటంవంటి విషయాలు ఈ సమస్యను సత్వరం చేపట్టేలా చేస్తున్నాయి. దీనిలో భాగమే బ్రిక్స్‌ న్యూ డెవెలప్‌మెంట్‌ బ్యాంకును అభివృద్ధి చేయటంతోపాటు ప్రపంచ ఫైనాన్స్‌ రంగంలో డాలర్‌ ఆధిపత్యానికి గండి కొట్టటానికి ఒక సమిష్టి నూతన కరెన్సీని సృష్టించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. అయితే దీనికి మూడింట రెండు వంతులున్న చైనా ఆర్థిక ప్రాబల్యం దేశాల సార్వభామత్వానికి, ఆర్థిక స్వతంత్రతకు అడ్డంకిగా ఉంటుందని భావిస్తున్నారు.
బ్రిక్స్‌ దేశాల మధ్య ఆయా దేశాల కరెన్సీలతో వాణిజ్యం జరగటం మరింత ఆచరణీయమైన పరిష్కారంగా ఉంటుందని చాలామంది భావిస్తు న్నారు. చైనా, రష్యాల మధ్య జరుగుతున్న వాణిజ్యం లో యువాన్‌, రూబుల్‌ కరెన్సీల పాత్ర సగానికి మించి ఉంది. భారత్‌ కు రష్యా ఎగుమతి చేస్తున్న చమురుకు రూపాయలలో చెల్లింపును రష్యా అంగీకరిస్తోంది. చైనాతో బ్రాజిల్‌ చేస్తున్న వాణిజ్యం లో యువాన్‌లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న చెల్లింపులలో మూడవ దేశ ప్రమేయం లేనప్పటికీ ఇతర కరెన్సీలలోకి మార్చటానికి, మారకం రేటులో అస్థిరత వంటి సమస్యలను పరిష్క రించవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రూపులో అంతర్జాతీయ చెల్లింపుల, సెటిల్‌ మెంట్ల వ్యవస్థను మెరుగుపరచవలసి ఉంటుంది.
బ్రిక్స్‌ జీ-7 దేశాల గ్రూపుకు భిన్నమైంది. జీ-7 రాజకీయంగా, ఆర్థికంగా, భావజాలపరంగా సారూ ప్యతగల గ్రూపు. కానీ బ్రిక్స్‌ ప్రతి కోణంలోను విభిన్నమైంది. జీ-7 అమెరికా నాయకత్వంలో నడిచే గ్రూపు. అయితే బ్రిక్స్‌ అలాకాదు. చైనాకు ఆర్థిక ప్రాబల్యం ఉన్నప్పటికీ అది అమెరికావంటి ఆధి పత్యంగా మారలేదు.
జీ-7 ప్రపంచం మీద ఆధి పత్యాన్ని చెలాయించేదిగావుంటే దేశాల సార్వభౌమ త్వాన్ని కాపాడేదిగా బ్రిక్స్‌ ఉంది. జీ-7 గ్రూపు కేవలం పశ్చిమ దేశాలకే పరిమితం అవుతుంటే బ్రిక్స్‌ వివిధ సంస్కృతుల, నాగరికతల సమ్మేళనంగా ఉంది. పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని కొనసాగించ టానికి పాత క్రమాన్ని(ఓల్డ్‌ ఆర్డర్‌) పరిరక్షించేందుకు జి-7 కట్టుబడివుంటే, ప్రపంచ క్రమంలో మరింత విభిన్నతను, మరింత సమతౌల్యాన్ని సాధించటానికి బ్రిక్స్‌ దేశాలు కృషి చేస్తున్నాయి.

Spread the love