రష్యాలో భారీ పేలుడు..

– 35 మంది దుర్మరణం
మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ పెట్రోల్‌/గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 35 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు. 3 దగేస్తానీ ప్రావిన్స్‌ రాజధాని మఖచ్‌ఖలా సిటీలో ఈ ప్రమాదం సంభవించింది. క్యాస్పియన్‌ సముద్ర తీరంలో ఉంటుందీ నగరం. రష్యా కాలమానం ప్రకారం.. రాత్రి 9:40 నిమిషాలకు జాతీయ రహదారిపై ఉన్న ఓ ఆటోమొబైల్‌ రిపేర్‌ షాప్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దానికి ఆనుకునే ఉన్న పెట్రోల్‌/గ్యాస్‌ స్టేషన్‌ శరవేగంగా వ్యాపించాయి. మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించేలోపే పెట్రోల్‌ స్టేషన్‌ను చుట్టుముట్టాయి. దీనితో ఒక్కసారిగా పేలిపోయిందా పెట్రోల్‌ బంక్‌. కిలోమీటర్‌ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థ చేసుకోవచ్చు. మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోల్‌, గ్యాస్‌ ఎగజిమ్మింది. దీనికి మంటలు తోడు కావడంతో ప్రమాదం తీవ్రత రెట్టింపయింది. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారి శరీరాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. పెట్రోల్‌ బంక్‌ శకలాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఈ పేలుడులో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 13 మంది పిల్లలు ఉన్నారు. బాధితుల హాహాకారాలు, పేలుడు శబ్దాలతో సంఘటన స్థలం భీతావహంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై అన్వేషణ సాగిస్తోన్నట్లు దగెస్తానీ గవర్నర్‌ సెర్గెరు మెలికోవ్‌ తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.

Spread the love