‘పిచ్చితననానికి నిర్వచనం’ : యూఎస్‌ఏ టుడే
న్యూయార్క్ : ఉక్రెయిన్ గెలుపులేని సమరంలో చిక్కుకుంది. ఉక్రెయిన్‌కు నిరంతరాయంగా ఆయుధ సరఫరా చేస్తూ అది రష్యాను ఓడిస్తుందని ఎదురు చూడటం అమెరికా, నాటో దేశాల ‘వ్యూహాత్మక వెర్రితనం’ అని యూఎస్‌ఏ టుడే పలువురు విదేశాంగ విధాన నిష్ణాతుల అభిప్రాయాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధరంగంలో విజయపరంపరను కొనసాగిస్తున్నదనీ, రష్యాపైన ‘గెలిచేదాకా’ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున సైనిక సహాయం, ఆర్థిక మద్దతు ఉంటుందని బైడెన్ ప్రగల్బాల గురించి పశ్చిమ దేశాల మీడియా చేసే ప్రచారానికి ఇటువంటి రిపోర్ట్ భిన్నమైంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు, వ్లదీమీర్ జెలెన్ స్కీ పశ్చిమ దేశాల శ్రేయోభిలాషుల విశ్వాసం కోల్పో తున్నాడని వాషింగ్టన్‌లోని అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్‌లో సీనియర్ ఫెల్లోగా పనిచేస్తున్న జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీన్ మెక్ ఫేట్ యూఎస్‌ఏ టుడే వార్తాపత్రికకు చెప్పాడు. జెలెన్ స్కీ బడాయిలతో నాటో నిరాశకు గురవుతు న్నదనీ, దాతలు నిస్పృహకు లోనవుతున్నారని ప్రొఫెసర్ సీన్ మెక్ ఫేట్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో గెలవగలదనే నమ్మకంతో వేలకువేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేయటమంటే అది ‘వ్యూహా త్మక వెర్రితనానికి నిర్వచనం’ అవుతుందని ఆయన చెప్పాడు.
ఉక్రెయిన్ యుద్ధంలో అనిశ్చితి అనివార్యమని, ఎందుకంటే పశ్చిమ దేశాల రాజకీయ, మీడియా కథనాలకు భిన్నంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే ఆలోచనే రష్యా అధ్యక్షుడు వ్లదీమీర్ పుతిన్‌కు లేదని వాయుసేన వెటరన్, విదేశాంగ విధానంపైన గతంలో అమెరికా విదేశాంగ శాఖకు సలహాదారుగా వున్న స్టీవెన్ మైయర్స్ యూఎస్‌ఏ టుడేకు చెప్పారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించి పశ్చిమ దిశగా తన దురాక్రమణను సాగించాలనే ప్రణాళికతో పుతిన్ ఉన్నందున ఎటువంటి పరిస్థితులలోనైనా ఉక్రెయిన్ కు మద్దతునివ్వాలని నాటో దేశాలు వాదిస్తున్నాయి. అయితే రష్యా అలాంటిదేమీ లేదని నిరూపించిందని మైయర్స్ అన్నాడు. రష్యా సైనిక ఎత్తుగడలు ఒక దేశాన్ని ఆక్రమించటానికి ఉద్దేశింపబడినట్టుగా లేవని, పుతిన్‌కు కావలసింది ఉక్రెయిన్ నాటోలో చేరకుండా చూడటమేనని ఆయన యుఎస్‌ఏ టుడేకి చెప్పారు.
అనేక నెలలపాటు అన్నివిధాలుగా ఉక్రెయిన్ సైన్యాన్ని సంసిద్దం చేశాక జూన్ లో మొదలైన ఎదురుదాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా చేతుల్లో ఉక్రెయిన్ సైనికులు వేలాదిమంది హతులవుతున్న ప్పటికీ, పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలు ధ్వంసం అవుతున్నప్పటికీ అమెరికా రక్షణ అధికారులు ఉక్రెయిన్ రష్యాను ఓడించగలదని బీరాలు పలకటం ఆపటంలేదు.
పరిస్థితిలో అనిశ్చితి ఏమీలేదని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఒక పత్రికా సమా వేశంలో చెప్పారు. అయితే ఉక్రెయిన్ సైన్యం ‘అనుకున్నంత వేగంగా, అనుకున్నంత దూరం’ వెళ్ళటం లేదని ఆయన అన్నాడు.