తైవాన్‌ కి అమెరికా భారీ సైనిక సాయం

తైవాన్‌ కు 345మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను, మందుగుండును, సేవలను అందించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌న్యూయార్క్‌ : తైవాన్‌ కు 345మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను, మందుగుండును, సేవలను అందించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్దారించారు. ఇలా అందించనున్న ఆయుధాలలో రీపర్‌ డ్రోన్లు కూడా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఆయుధ సరఫరాను 1961 విదేశీ సహాయ చట్టం ప్రకారం చేయనున్నట్టు అధ్యక్ష భవనం విదేశాంగ శాఖకు తెలియజేసింది.
తైవాన్‌ కోసం ఇటువంటి సహాయాన్ని అందించనున్నట్టు మే నెలలోనే రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ కి తెలియజేశారు. తైవాన్‌ కు ఈ ఆర్థిక సంవత్సరంలో 1బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందించటానికి అమెరికన్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే ఆమోదించింది. అమెరికా ఆమోదంతో తైవాన్‌ జూన్‌ నెలలో చేసిన 440మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆయుధాల కొనుగోలుకు ఈ సహాయం అదనం.
ఈ ఆయుధ సరఫరాపైన అమెరికాకు చైనా తన తీవ్ర నిరసనను తెలియజేసింది. చైనా తైవాన్‌ ను ‘ఒక చైనా విధానం’ ప్రకారం తనలో అంతర్భాగం అని ప్రకటించింది. 1949లో చైనా విప్లవం విజయవంతం కావటంతో తైవాన్‌ దీవికి పారిపోయిన చాంగై షేక్‌ అమెరికా సహకారంతో అక్కడ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1979దాకా తైవాన్‌ నే అసలు చైనా(‘రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’)గా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. 1979లో బైజింగ్‌ లోని ప్రభుత్వమే అసలు చైనాగా అమెరికా గుర్తించినప్పటికీ తైవాన్‌ భద్రతకు హామీ ఇవ్వటం, ఆయుధ సరఫరా చేయటం అమెరికా నిరంతరం చేస్తూనే ఉంది.
మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి
మాస్కో : రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడి చేశాయని మాస్కో నగర మేయర్‌ సెర్గి సోబియానిన్‌ ఆదివారం ఉదయం తెలిపారు. నగరంలోని ఆఫీస్‌ టవర్లు రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయని, ఎవరూ గాయపడలేదని సోబియానిన్‌ తన టెలిగ్రామ్‌ చానెల్‌లో తెలిపారు. ఈ దాడిలో మొత్తంగా మూడు డ్రోన్లు పాల్గొన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కో వెలుపల గాల్లోనే ఒక డ్రోన్‌ ధ్వంసమైందని, మిగిలిన రెండింటినీ వైమానిక రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని ఆ ప్రకటన పేర్కొంది. దాంతో ఆ రెండు డ్రోన్లు నగరంలోని నివాసయేతర కాంప్లెక్స్‌ ప్రాంతంలో పడిపోయాయని తెలిపింది. 50 అంతస్తుల ఐక్యూ కార్టర్‌ కాంప్లెక్స్‌లో ఐదు, ఆరవ అంతస్తుల మధ్య పెద్ద పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. ఏడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వసంస్థలకు చెందిన కార్యాలయాలు ఆ కాంప్లెక్స్‌లో వున్నాయి. ఒకో- 2 భవనంలో రెండో పేలుడు సంభవించిందని, అక్కడ సెక్యూరిటీ గార్డు ఒకరు గాయపడ్డారని తెలిపింది. దెబ్బతిన్న భవనాలను వెంటనే ఖాళీచేయించారు.

Spread the love