బాలికలకు విద్యను నిరాకరిస్తున్న

– తాలిబన్‌ పాలకులను ఐసిసి విచారించాలి
– ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత గార్డన్‌ బ్రౌన్‌
ఐక్యరాజ్య సమితి : ఆఫ్ఘన్‌ బాలికలు, మహిళలకు విద్య, ఉపాధిని నిరాకరిస్తూ తాలిబన్‌ నేతలు పాల్పడిన నేరాలకు గానూ వారిని అంతర్జాతీయ క్రిమినల్‌ న్యాయస్థానం (ఐసిసి) ప్రాసిక్యూట్‌ చేయాలని అంతర్జాతీయ విద్యా విభాగానికి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత గార్డన్‌ బ్రౌన్‌ పేర్కొన్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుని 15వ తేదీతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఆన్‌లైన్‌ పత్రికా సమావేశంలో మాట్లాడారు.
ఈనాడు ప్రపపంచలో మహిళలు, బాలిక హక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయంటే అందుకు పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. విద్య, ఉపాధిలను నిరాకరించడమంటే అది లింగ వివక్ష కిందకు వస్తుందని, దాన్ని మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా చూడాల్సి వుంటుందని అన్నారు. ఈ మేరకు ఐసిసి ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌కు లీగల్‌ ఒపీనియన్‌ను పంపినట్లు చెప్పారు. అంతర్జాతీయ క్రిమినల్‌ న్యాయస్థానం ఈ అంశంపై దర్యాప్తు జరపాలని కోరారు. 1996 నుండి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించినపుడు కూడా తాలిబన్లు ఇలాగే ఇస్లామిక్‌ చటాద్టనికి కఠినమైన భాష్యం చెబుతూ మహిళలపై ఆంక్షలు విధించారు.
ఆరవ గ్రేడ్‌ తర్వాత ఆడపిల్లలు స్కూలుకు వెళ్ళరాదని, ఉద్యోగాలు చేయకూడదని, బహిరంగ ప్రదేశాలకు, జిమ్‌లకు, బ్యూటీ సెలూన్లకు వారు వెళ్లరాదని నిషేధం విధించారు. కాందహార్‌లో తాలిబన్‌ సుప్రీం నేత హిబతుల్లా అఖుంద్జాను కలిసేందుకు ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందాన్ని పంపాల్సిందిగా బ్రౌన్‌ ముస్లిం దేశాలను కోరారు. మహిళలకు విద్య, ఉపాధులను నిషేధించాలని ఖురాన్‌లో ఎక్కడా పేర్కొనలేదని ఆయనకు వివరించాలని, వెంటనే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాలని ఆయన సూచించారు. తాలిబన్ల ప్రభుత్వంలోనే ఈ అంశంపై చీలిక వున్నట్లు కనిపిస్తోందని అన్నారు. విద్యా శాఖలో, ప్రభుత్వంలో చాలా మంది బాలికల విద్యా హక్కులు పునరుద్ధరించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదిలావుండగా, బాలికల విద్యపై ప్రస్తుతమున్న నిషేధం కొనసాగుతుందని తాలిబన్ల ముఖ్య ప్రతినిధి స్పష్టం చేశారు.

Spread the love