1.5 డిగ్రీల సెల్సియస్‌ ముప్పు గురించి అతిగా ప్రచారం వద్దు

– ఐరాస ఐపీసీసీ నూతన చీఫ్‌
వాషింగ్టన్‌ : 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ముప్పు గురించి అతిగా ప్రచారం చేయవద్దని ఐక్యరాజ్య సమితి యొక్క ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఐపీసీసీ) నూతన చీఫ్‌ జీమ్‌ స్కీయా తెలిపారు. ఐపీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరించిన వెంటనే మీడియాతో స్కీయా మాట్లాడారు. 1.5 డిగ్రీల సెల్సియస్‌ ముప్పు గురించి అతిగా ప్రచారం చేయడం వలన గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలనే అంతర్జాతీయ సమాజం యొక్క లక్ష్యానికి ఎక్కువ విలువ లేకుండా పోతుందని అన్నారు. అలాగే గ్లోబల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరిగితే ‘మనం (ప్రజలు) నిరాశ చెందకూడదు. దిగ్భ్రాంతి చెందకూడదు’ అని అన్నారు. ‘మనమందరం అంతరించిపోతున్నాము అనే సందేశాన్ని నిరంతం ప్రచారం చేస్తుంటే అది ప్రజలను స్థంభింపచేస్తుంది. వాతావరణ మార్పులపై పట్టు పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ప్రజలను అడ్డుకుంటుంది’ అని అన్నారు. అలాగే 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచం అంతం కాదని, అయితే ఇది మరింత ప్రమాదకరమైన ప్రపంచం అవుతుందని అన్నారు. స్కాట్లాండ్‌కు చెందిన 69 ఏండ్ల స్కీయా ఐపీసీసీ కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు.

Spread the love