బిల్లు ఆమోదంలో పార్లమెంట్‌ జాప్యానికి నిరసనగా

– ఇండోనేషియాలో డొమెస్టిక్‌ వర్కర్ల నిరశనలు
జకార్తా : ఇండోనేషియాలో ఇంటిపనివారలు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగారు. జకార్తాలో పార్లమెంట్‌కు ఎదురుగా వేసిన శిబిరాల్లో దాదాపు 40మంది డొమెస్టిక్‌ వర్కర్స్‌ అలయన్స్‌కి చెందిన కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఇంటిపనివారల రక్షణకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో జాప్యాన్ని వారు నిరసించారు. రాజధాని జకార్తాతో పాటూ ఇతర ప్రధాన నగరాల్లో సోమవారం నిరశనలు జరిగాయి. బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతి రోజూ ఇలా నిరశన చేపడతామని డొమెస్టిక్‌ వర్కర్ల నేషనల్‌ అడ్వకసీ నెట్‌వర్క్‌్‌కి చెందిన లీటా అంగ్రాయిని చెప్పారు. ప్రభుత్వం నుండి వారికెలాంటి రక్షణ వుండడం లేదని ఆమె విమర్శించారు. పనిమనుష్యుల రక్షణ బిల్లును తక్షణమే ఆమోదించి చట్టంగా మార్చాలని ఆమె పార్లమెంట్‌ సభ్యులను కోరారు. బిల్లు అమోదంలో జాప్యం జరిగిన కొద్దీ మరింతమంది వర్కర్లు తీవ్రమైన హింస, వివక్షలకు గురవుతార ని ఆమె హెచ్చరించారు. ఇండోనేషియా లో డొమెస్టిక్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రతిబింబించేలా వారు గడియారాలు, నేప్‌కిన్స్‌, ఇతర పారిశుధ్య పరికరాలను ప్రదర్శించారు. హింస, అవమానాలు, వివక్ష, దూషణలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు 2014లో డొమెస్టిక్‌ వర్కర్స్‌ బిల్లును పార్లమెంట్‌ సభ్యులు ప్రతిపాదించారు. అప్పటి నుండి కనీసం మూడుసార్లు ఈ బిల్లును ప్రాధాన్యతా జాబితాలో నుండి తొలగిస్తూనే వస్తున్నారు.

Spread the love