మయన్మార్‌లో విరిగిపడిన కొండచరియలు

Bursting landslides in Myanmar– 30మంది గల్లంతు
– కొనసాగుతున్న సహాయ చర్యలు
యాంగాన్‌ : ఉత్తర మయన్మార్‌లోని పచ్చల గనిలో కొండచరియలు విరిగిపడడంతో 30మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మయన్మార్‌లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌కు 950కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతమైన హప్‌కంత్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏరియాలో అతి పెద్దవైన, ఆకర్షణీయంగా వుండే పచ్చల గనులు వున్నాయి. పచ్చలు తవ్వేందుకు మొత్తంగా 30మంది గనుల్లోకి వెళ్ళారు. ఆదివారం తెల్లవారు జామున 3.30గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి ఆ పక్కనే గల మన్నా గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో కూలీలందరూ ఆ ధాటికి సరస్సులోకి కొట్టుకుపోయారు. గ్రామానికి సమీపంలో మట్టి పెళ్ళలు, శిధిలాలు, పెద్ద మొత్తంగా పడ్డాయని, వాటితో కలిసి దాదాపు వెయ్యి అడుగుల లోతు వున్న ఆ సరస్సులోకి కార్మికులు కొట్టుకుపోయారని చెప్పారు. 34 మంది గల్లంతైనట్లు నిర్ధారించినట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు. సోమవారం చెరువు దగ్గర స్థానిక సహాయ బృందాలు పనిచేస్తున్నాయి. 8మంది కార్మికులు గాయపడ్డారు, వారిని ఆదివారం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారిలో ఎక్కువమంది పురుషులే. ఇలాంటి సంఘటనలు ఏడాది పొడవునా ఇక్కడ జరుగుతునే వుంటాయి. మైనింగ్‌ కంపెనీలు భారీ యంత్రాలతో తవ్వి వదిలివేసిన ప్రాంతాల్లో ఈ కార్మికులు సొంతంగా తవ్వుకుంటూ వుంటారు. పచ్చల ముక్కలు ఏరుకోవడమే వారి జీవనాధారంగా వుంటుంది. ఆ ప్రాంతాల్లోనే వారు నివాసముంటారు. 2020 జులైలో ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 162మంది చనిపోయారు.

Spread the love