బీహార్‌ కుల ప్రాతిపదిక సర్వేపై 18న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : బీహార్‌లో కులాల ప్రాతిపదికన సర్వే చేపట్టడానికి అనుమతిస్తూ ఆగస్టు 1వ తేదీన పాట్నా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై విచారణను సుప్రీం కోర్టు ఆగస్టు 18కి వాయిదా వేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే రోజు అంటే 18న విచారిస్తామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టిలతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఎన్‌జిఓ ‘ఏక్‌ సోచ్‌ ఏక్‌ పార్యాస్‌’ సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. మూడు రోజుల్లోగా కులాల ప్రాతిపదిక సర్వేను పూర్తి చేయాల్సిందిగా ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అన్నిఅంశాలను అదే రోజు విచారిస్తామని, అప్పటికల్లా న్యాయమూర్తులు కూడా హైకోర్టు తీర్పును కూలంకషంగా పరిశీలించాలని బెంచ్‌ కోరింది. పిటిషనర్ల తరపు న్యాయవాది అయిన సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోV్‌ాతగి మాట్లాడుతూ, ఈ అంశం కోర్టు పరిశీలనలో వున్నందున ఈలోగా సర్వే వివరాలు ప్రచురించవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు. అలా చేసినట్లైతే ఎదుటి పక్షం వాదనలు వినకుండా సర్వేపై పరోక్షంగా స్టే విధించినట్లవుతుందని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నారు.

Spread the love