హెచ్‌ఎంఏ సవరణకు హర్యానా సర్కారు కసరత్తు

– ఒకే గోత్రం, ఒకే గ్రామ వివాహాలపై
– నిషేధ ప్రక్రియను ప్రారంభించిన ఖట్టర్‌ ప్రభుత్వం
– ఖాప్‌ పంచాయతీల డిమాండ్ల మేరకు చర్యలు
న్యూఢిల్లీ: హర్యానా ప్రభుత్వం హిందూ వివాహ చట్టం, 1955 (హెచ్‌ఎంఏ)ని సవరించే ప్రక్రియను ప్రారంభించింది. ఖాప్‌ పంచాయతీలు ఒకే గోత్రం, ఒకే గ్రామ వివాహాలు, సహజీవనం (లివ్‌-ఇన్‌-రిలేషన్‌షిప్‌) రిజిస్ట్రేషన్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశాయి. దీనికి ప్రతిస్పందనగా హర్యానాలోని బీజేపీ సర్కారు నిషేధ ప్రక్రియకు దిగటం గమనార్హం. భారత్‌ భూమి బచావో సంఘర్ష్‌ సమితి అధ్యక్షుడు రమేష్‌ దలాల్‌, సర్వజాతియా కండెలా ఖాప్‌ అధినేత ధరమ్‌ పాల్‌ కండెలా సమర్పించిన డిమాండ్‌ల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి.. తదుపరి చర్య కోసం పౌర వనరుల సమాచార శాఖ (సీఆర్‌ఐడీ) ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి రిఫర్‌ చేశారు. నివేదిక ప్రకారం కండెలా మాట్లాడుతూ.. ”ఒకే గోత్రం, ఒకే గ్రామ వివాహాలు సమాజంలోని సామాజిక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఖాప్‌ పంచాయతీల డిమాండ్లకు అనుగుణంగా హెచ్‌ఎంఏ సవరణ కోసం తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాం” అని అన్నారు. కాగా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం ఇప్పుడు హెచ్‌ఎంఏలో సవరణలు తీసుకురానుండటంతో ఇటు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నదని సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అన్నారు.

Spread the love