కమ్యూనిస్టులను గెలిపించండి

Let the communists win– బీజేపీతో దేశానికి ప్రమాదం
– రేవంత్‌ రెడ్డీ.. అహంకారం తగ్గించుకో..
– ఆ అవహంకారంతోనే కేసీఆర్‌ ఓడారు
– కేరళ వెళ్లి అడ్డగోలుగా మాట్లాడావ్‌..
– ఇండియా కూటమిలో అందరం ఉన్న విషయం మర్చిపోవద్దు : బీవీ. రాఘవులు
– జహంగీర్‌ జనం మనిషి : తమ్మినేని
– భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ నామినేషన్‌
– రైల్వే స్టేషన్‌ నుంచి ఏఆర్‌ గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ, సభ
”కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి లౌకికతత్వానికి హాని కలిగిస్తోంది. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రాలను మున్సిపల్‌ స్థాయికి దిగజార్చుతోంది.. పన్నుల్లో 50 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి.. మాజీ సీఎం కేసీఆర్‌ అహంకారంతోనే ఓడిపోయారు.. రేవంత్‌రెడ్డీ అలాగే వ్యవహరిస్తున్నారు.. అహంకారం తగ్గించుకోవాలి.. ఇండియా కూటమిలో అందరం ఉన్నామన్న విషయం మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలి..” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుల బీవీ.రాఘవులు అన్నారు.
నవతెలంగాణ-భువనగిరి

”కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి లౌకికతత్వానికి హాని కలిగిస్తోంది. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రాలను మున్సిపల్‌ స్థాయికి దిగజార్చుతోంది.. పన్నుల్లో 50 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి.. మాజీ సీఎం కేసీఆర్‌ అహంకారంతోనే ఓడిపోయిండు.. రేవంత్‌రెడ్డీ అలాగే వ్యవహరిస్తున్నారు.. అహంకారం తగ్గించుకోవాలి.. ఇండియా కూటమిలో అందరం ఉన్నామన్న విషయం మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలి..” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుల బీవీ.రాఘవులు అన్నారు.
శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి ఏఆర్‌ గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీ పదేండ్ల పాలనలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మికులు విచ్ఛిన్నమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మైనార్టీల జీవితాలు బుగ్గిపాలయ్యాయన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే సీపీఐ(ఎం) లక్ష్యం అన్నారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తూ.. డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బీజేపీ పూలమాలలు వేస్తే, తాము ఆయన ఆశయాలు, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పూల మాలలు వేస్తామన్నారు. ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించాలని కోరారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని జనానికి పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ఐక్యత, అభివృద్ధికి ఆటంకమని చెప్పారు. సీఏఏ పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిందని, అది లౌకిక వాదానికి, మైనార్టీలకు హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దానిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
దేశంలో వసూలు చేసే అన్ని రకాల పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు కేటాయించాలని రాఘవులు కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలను మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం లభిస్తుందన్నారు. మత, కుల వ్యవస్థల వల్ల మైనార్టీలు, గిరిజనులు మహిళలకు హక్కులు, ప్రత్యేక సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్‌కు మోడీ ఒప్పుకోవడం లేదన్నారు.
కేంద్రం వివక్షపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఢిల్లీకి వెళ్లి పోరాడారని రాఘవులు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎదిరించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను కేంద్ర ప్రభుత్వం జైల్లో పెట్టించిందని తెలిపారు. బీజేపీ ప్రగల్భాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, అభ్యర్థుల చరిత్రను, సీపీఐ(ఎం) అభ్యర్థి చరిత్రను చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు.
మునుగోడు ఎన్నికల్లో సీపీఐ(ఎం) సహాయంతో బీఆర్‌ఎస్‌ గెలిచిందని గుర్తు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ కుమార్తె కవితను జైల్లో పెడతారని బీజేపీకి భయపడి కమ్యూనిస్టులతో అవగాహనకు రాలేదని చెప్పారు. బీజేపీ కవితను జైల్లో పెట్టిందని, దీంతో కేటీఆర్‌ నోరు మూగబోయిందని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించారు. తమ పార్టీకి బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో, కేరళలో కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నప్పటికీ దేశ భవిష్యత్‌ కోసం ఇండియా కూటమిలో చేరి బీజేపీని ఓడించడానికి పని చేస్తున్నామన్నారు.
కేరళకు వెళ్లి సీపీఐ(ఎం)ను తిట్టే అంత సమయం రేవంత్‌కు ఉందని, బీజేపీపై పోరాడడానికి మాత్రం లేదని రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్టు కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కక్షగట్టి కేసు నమోదు చేసినంత మాత్రాన విజయన్‌ దోషి కాదని తెలిపారు. పొట్ట చించుకుంటే పేగులు కాళ్ల మీద పడ్డట్టు రేవంత్‌ వ్యవహారం ఉందని విమర్శించారు. ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధినేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ రూ.1500 కోట్లకు సంబంధించి అపరాధ రుసుం కట్టాలని కేసు నమోదైందని, దాన్ని తాము తీవ్రంగా ఖండించామని గుర్తు చేశారు. కానీ, రేవంత్‌రెడ్డి నోరు ఉందని పారేసుకోవద్దని హితవు పలికారు. రాజకీయాలు ఉండాలి కానీ ప్రతిదానినీ ఒకే విధంగా చూడొద్దన్నారు. కేసీఆర్‌ అహంకారంతోటే ఓడిపోయారని రేవంత్‌ రెడ్డి ఆ బాటలో నడవద్దని సూచించారు. బీజేపీ, కమ్యూనిస్టులు కలిసి కేరళలో పనిచేస్తున్నారని రేవంత్‌ పేర్కొనడం అతని అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎంపీ సీట్లు రాకుండా అడ్డుకునేందుకు తాము సహాయం చేస్తామని, ఆ రకంగా కలిసి రావాలని కోరారు. ప్రతి ఓటు విలువైనదని వివరించారు. భువనగిరిలో ప్రజాతంత్ర శక్తులు, లౌకిక శక్తులు సీపీఐ(ఎం)కు ఓటు వేయాలని కోరారు. సీపీఐ(ఎం)కు వేసే ప్రతీ ఓటు దేశ అభివృద్ధికి వేసినట్టేనని చెప్పారు.
జహంగీర్‌ గెలుపు అవసరం : వీరయ్య, చెరుపల్లి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్‌ మూసీ కాలుష్యంపై నెలరోజుల పాటు పోరాటం చేశారన్నారు. గంగా ప్రక్షాళనకు కోట్లు ఖర్చు పెట్టే కేంద్రం మూసీ కాలుష్యంపై డబ్బులు ఖర్చు చేయడం లేదన్నారు. మూసీనది సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే జహంగీర్‌ను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గొంతెత్తి అడుగుతారని చెప్పారు. భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో జహంగీర్‌ను గెలిపించి ఎర్రజెండా చరిత్రకు పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతి, మల్లు లక్ష్మి, తీగల సాగర్‌, జాన్‌వెస్లీ, అబ్బాస్‌, డిజి.నర్సింహారావు, పోతినేని సుదర్శన్‌, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, పైళ్ల ఆశయ్య, బుర్రి ప్రసాద్‌, వెంకట్రాములు, అరుణ జ్యోతి, విజయలక్ష్మి, జగదీష్‌, ఎస్‌.రమ, వెంకట్‌ పాల్గొన్నారు.
రేవంత్‌ అనవసర ఆరోపణలు చేయొద్దు : తమ్మినేని
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ ఫాసిస్టు విధానాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం దేశాన్ని భ్రష్టు పట్టించేలా ఉన్నాయన్నారు. దేశాన్ని హిందూ దేశంగా, రాజ్యంగా మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారని, ఇది ప్రమాదకరమని అన్నారు. హిందూ రాజ్యమంటే అధికంగా ఉండే హిందువులకు మేలు చేయడం కాదన్నారు. అలా అనుకుంటే పొరపాటేనన్నారు. అగ్రకులాల్లో ఉన్న కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టడమేనన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. అగ్రకుల భావజాలం, కార్పొరేట్‌ శక్తులు రాజ్యమేలుతారని, పేదలు మరింత పేదలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం అంటే ఒక ఫ్యూడల్‌ ధర్మమని, అది మనువాదం నుంచి వచ్చిందని చెప్పారు. రాజ్యాంగానికి కూడా పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు గ్రహించాలని అన్నారు. బీజేపీని ఓడించడానికి అందరితో కలిసి వెళ్తామని చెప్పారు. ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్‌ సంప్రదించడం లేదన్నారు. కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. ఈనెల 21వ తేదీన కాంగ్రెస్‌ నాయకత్వం సీపీఐ(ఎం)ను కలవనున్నట్టు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఏదేమైనా రాష్ట్రంలో తాము భువనగిరి స్థానం నుంచి పోటీలో ఉండటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ మొండి వైఖరి విడనాడాలన్నారు. అనవసర ఆరోపణలు చేయొద్దని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. మా దేహం ముక్కలైనా సరే దేశాన్ని ముక్కలు కానివ్వబోమని, ఈ దేశంలో బీజేపీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. స్పష్టమైన లక్ష్యంతో సీపీఐ(ఎం) ముందుకు పోతుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి తిరుగు లేదని చెప్పారు.. కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌ వచ్చాక.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక కాంగ్రెస్‌కు తిరుగు లేదన్నారు.. బీఆర్‌ఎస్‌ కూడా అదే చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని.. అర్థం చేసుకోకపోతే కమ్యూనిస్టులం ఆత్మవిశ్వాసం నిలబెట్టుకోలేమన్నారు. భువనగిరి తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం వహించిన ఉద్యమాల గడ్డ అని తెలిపారు. అలాంటి ఉద్యమ గడ్డలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక ప్రజా సమస్యలపై 35 ఏండ్లుగా పోరాడుతున్న వ్యక్తి ఎండీ జహంగీర్‌ అని తెలిపారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఎరుపెక్కిన భువనగిరి..
సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా భువనగిరి నగరం ఎరుపెక్కింది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎర్రజెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. నినాదాలతో భువనగిరి పట్టణం మార్మోగింది. ర్యాలీ అగ్రభాగాన రాఘవులుతోపాటు అభ్యర్థి జహంగీర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలు నడుస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఓపెన్‌టాప్‌ జీప్‌లో కార్యకర్తలకు అభివాదం చేశారు. కళాకారులు కోలాటం వేసుకుంటూ ముందుకు నడిచారు. పీఎన్‌ఎం కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. 

Spread the love