రాష్ట్ర అవతరణను తప్పు పట్టిన మోడీకి బుద్ధి చెప్పాలి

Misconceived statehood Modi should be wise– కమ్యూనిస్టులారా కలిసి పోరాడుదాం..
– కేసీఆర్‌.. ప్రభుత్వాన్ని కూలగొడతావా? నీవల్ల కాదు
– ప్రగతి భవన్‌ను జ్యోతిరావుఫూలే భవన్‌గా మార్చాం
– ఎందరో అమరవీరుల పోరాటాల గడ్డ భువనగిరి ఖిల్లా
– ఆగస్టు 15కు తప్పకుండా రూ.2లక్షల రుణమాఫీ
– చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించండి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థుల బలిదానాన్ని చూసి సోనియాగాంధీ రాష్ట్ర అవతరణను చేస్తే మోడీ దాన్ని తప్పు పట్టారు. అలాంటి పార్టీకి, వ్యక్తికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అలాగే, మేము చేసిన సేవలకు గుర్తింపుగా.. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్‌ లెక్కచేయకుండా ప్రభుత్వాన్ని కూలగొడతానని మాట్లాడుతున్నారు. నల్లగొండ పోరాట వీరులైన.. కమ్యూనిస్టులారా కలిసి పోదాం.. మిమ్మల్ని అవమానించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుదాం.” అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, మోడీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి పట్టణంలో కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలిపించాలని నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని అంబేద్కర్‌ చౌరస్తాలో కార్నర్‌ సభలో సీఎం ప్రసంగించారు. భువనగిరి, నల్లగొండ అంటేనే పౌరుషం.. విప్లవ చైతన్యవంతులైన ప్రజల అడ్డా అని తెలిపారు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించి కొమరం భీమ్‌ ప్రారంభించిన జల్‌- జంగల్‌-జమీన్‌ ఆసరాగా భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటానికి కమ్యునిస్టులు నాంది పలికారని గుర్తుచేశారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, కొండా లక్ష్మణ్‌బాపూజీ లాంటివారు బానిసత్వానికి అడ్డంగా నిలబడి బాంచన్‌ దొర అనే నినాదానికి చరమగీతం పలికి, ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన త్యాగమూర్తుల గడ్డ అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలను బంధ విముక్తి చేసిన యోధులను స్మరించకుండా ఉండలేమన్నారు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేదలకు అండగా ఉండి సొంత నిధులను ఖర్చు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ మీకు అండగా ఉన్నారని తెలిపారు. ఒకవైపు నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, జానారెడ్డి ఉన్నారని, మరో వైపు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారని, వారి మధ్య మెజార్టీ కోసం పోటీ ఉందన్నారు.
ఆగస్టు 15కి తప్పకుండా రుణమాఫీ
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌ భరోసా ఇచ్చారు. రైతులకు వచ్చే సీజన్‌లో ధాన్యానికి రూ.500ల బోనస్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తామని తెలిపారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.కడుపు చేత పట్టుకొని ఆటోలు నడిపిస్తున్న యువత గుట్ట పైకి రాకుండా ఆపేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తాను స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరిక మేరకు వెంటనే ఆటోలు నడిపించేందుకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు.
కమ్యూనిస్టులారా.. కలిసి మోడీని ఓడిద్దాం
ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐతో కలిసి పోదామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లి కలిశారని, తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మోడీని గద్దె దించడానికి కలిసి కృషి చేయాలని కోరారు. తాను కమ్యూనిస్టులను ఏనాడూ అవమానించలేదని, అలాంటి సంఘటనలు లేవన్నారు. కమ్యూనిస్టులను తన అవసరాల మేరకు కడుపులో తలకాయ పెట్టి, వారి సహాయం తీసుకొని కరివేపాకు లాగా తీసిపారేసిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తనతోపాటు ముఖ్యమంత్రి పదవికి అన్ని అర్హతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్నాయన్నారు. కేంద్ర కమిటీ తనకు ముఖ్యమంత్రి పదవి ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయించిందన్నారు. సీఎం పదవిని తాను ఏనాడు గర్వంగా భావించలేదని, బాధ్యతతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు. 18 గంటలు పని చేస్తూ పేదలకు అండగా ఉంటున్నానని తెలిపారు. ప్రగతి భవన్‌ను జ్యోతిరావు ఫూలే భవనంగా మార్చామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను చెరబట్టి ఈ దేశంలో మోడీ విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే అందరమూ కలిసి పోరాడాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలిపారు. నోట్ల రద్దు, రైతులపై నల్ల చట్టాల వంటి అంశాల్లో.. కేసీఆర్‌ మోడీ దగ్గర ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సామెల్‌, మలిరెడ్డి రంగారెడ్డి, కొమ్మిడి ప్రతాపరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love