జైల్లో పెడితే బెదరం

Fear of being put in jail– దేశాన్ని కాపాడుకుంటాం…
– రాజ్యాంగాన్ని రక్షించడం ముఖ్యం
– బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
– మోడీ హామీ అవసరం లేదు.. రాజ్యాంగ హామీ కావాలి
– దేశంలో 90 శాతం నిరుద్యోగ యువత
– ఇండియాకు ఓటుతోనే దేశ రక్షణ
– ఆలోచించి ఓటు వేయండి : రాంచీలో ఇండియా ఫోరం నేతల పిలుపు
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యాదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ ఓటమి ఖాయమైందని, ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఇండియా బ్లాక్‌ నేతలు స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ప్రభాత్‌ తారా గ్రౌండ్‌ వేదికగా ఇండియా ఫోరం న్యాయ తిరుగుబాటు మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి జార్ఖండ్‌లోని అధికార జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నాయకత్వం వహించింది. వేదికపై అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లకు ప్రత్యేకంగా రెండు కుర్చీలను ఖాళీగా ఉంచారు. ఇందులో పాల్గొన్న జెఎంఎం కార్యకర్తలు సోరెన్‌ మాస్క్‌లు ధరించి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ”జైలు కా తాలా తూటేగా, హేమంత్‌ సోరెన్‌ చుటేగా” (జైలు తాళం పగలగొడతాం. హేమంత్‌ సోరెన్‌ను విడుదల అవుతారు), ”జార్ఖండ్‌ ఝుకేగా నహీ” (జార్ఖండ్‌ తలవంచదు)” వంటి నినాదాలు చేశారు.
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, జెఎంఎం అధినేత శిబు సోరెన్‌, కేజ్రీవాల్‌ భార్య సునీతతో పాటు హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన సోరెన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌, ఆర్‌జేడీ నేత, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గైర్హాజరయ్యారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, అందుకే ఈ ర్యాలీకి హాజరుకాలేకపోతున్నానని, తమ పార్టీ సంఘీభావం, పూర్తి మద్దతు ఉంటుందని హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన సోరెన్‌కు లేఖ రాశారు. దాన్ని ఆమె సభలో చదివి వినిపించారు.
బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది : ఖర్గే
వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ”మేము ప్రజలకు భయపడుతాము. ప్రధాని మోడీ లాంటి నాయకులకు కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులను జైలులో పెట్టడం వల్ల మేం భయపడం. ఇండియా బ్లాక్‌తో విడిపోవడానికి నిరాకరించనందుకు హేమంత్‌ సోరెన్‌ను జైలుకు పంపించారు. వారు మమ్మల్ని ఇసుక కింద పాతిపెట్టినా, మేము పైకి వస్తూనే ఉంటాం. రామ మందిర శంకుస్థాపన, పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా ప్రధాని అవమానించారు. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. ఉపాధి, రైతుల ఆదాయంపై ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మహాఘట్‌బంధన్‌కు ఓటు వేయండి. ఎవరికీ భయపడవద్దు. మోడీని ఎన్నికల్లో ఓడిపోనివ్వండి” అని అన్నారు.
నియంత పాలనకు చరమగీతం: జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌
నియంత పాలనకు చరమగీతం పాడాలని జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీ, జార్ఖండ్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. ఈ ర్యాలీ ద్వారా కేంద్రంలోని నియంత వైఖరిని బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని తొలి నుంచి అస్థిర పరిచేందుకు కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు. ఆ క్రమంలో తుదకు హేమంత్‌ను జైలుకు పంపారన్నారు. ఢిల్లీ ప్రజలకు సైతం ఇదే తరహా అనుభవం ఎదురైందన్నారు.
ఇండియా బ్లాక్‌కు ఓటేసి దేశాన్ని రక్షించండి: ఫరూక్‌ అబ్దుల్లా
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ర్యాలీలో మాట్లాడుతూ ”ప్రతి రాష్ట్రానికి దాని స్వంత భాష ఉంటుంది. మనమందరం కలిసినప్పుడే భారతదేశం అవుతుంది. ఈ దేశ సౌందర్యం రంగులతో నిండి ఉంది. ఈ రంగులన్నింటినీ ఏకం చేసేందుకు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారు. నేను ముస్లింని, అయినా గాంధీ, నెహ్రూ వంటి ఇండియా నాయకులను అంగీకరిస్తున్నాను. మీరు దేశాన్ని గౌరవించాలను కుంటే, ఎన్నికల సమయంలో ఇండియా ఫోరానికి ఓటు వేయండి. దీని ద్వారానే మనం దేశాన్ని రక్షించగలం” అని అన్నారు.
రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు: తేజస్వి
బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ ”బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని పదే పదే మార్చాలని మాట్లాడుతున్నారు. ఇది బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం, ఎవరో యాదృచ్ఛిక బాబా కాదు. దాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. బీహార్‌లో కూడా రాజ్యాంగాన్ని మార్చుతామని వారి మంత్రులు, అభ్యర్థులు నిరంతరం చెబుతున్నారు. దేశ ప్రజలు వీరిని అంతమొందిస్తారు” అని విమర్శించారు.
బీజేపీ నిష్క్రమణ ఖాయం: అఖిలేశ్‌ యాదవ్‌
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ హామీపై టార్గెట్‌ చేశారు. ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తులు ఎన్నో ప్రకటనలు చేశారని అన్నారు. ఇప్పుడు గ్యారంటీతో వస్తున్నారు. అయితే దేశ ప్రజలు రాజ్యాంగం హామీని కోరుకుంటున్నారే తప్ప బీజేపీ హామీని కాదని అన్నారు. ఇక్కడ ప్రజలే నిర్ణయం తీసుకుంటే బీజేపీ నిష్క్రమణ ఖాయమని అన్నారు. ”ఇది లార్డ్‌ బిర్సా ముండా భూమి. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ భయపడలేదు. తలవంచలేదు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మీ చరిత్రను గుర్తుంచుకోవాలి. వారు మీకు ఏమి చేశారో కూడా గుర్తుంచుకోండి. ఈసారి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ బహిర్గతం అయినప్పుడు బీజేపీ బండారం బయటపడిందని అన్నారు. అత్యధిక విరాళాలు సేకరించిన ప్రభుత్వం ఇదేనని, అందువల్ల నేడు దేశ రాజ్యాంగాన్ని రక్షించడం చాలా ముఖ్యమైనదిగా మారిందని అన్నారు. మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. 2014లో వచ్చిన వారు 2024లో వెళ్లిపోతారని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. మన దేశాన్ని పదేండ్లలో వెనక్కి నెట్టడానికి కృషి చేసిన వారి వీడ్కోలు కూడా అంతే సందడిగా ఉండేలా అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం: ప్రియాంక చతుర్వేది
శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం ఉందని, అలాగే నిరుద్యోగం తాండవిస్తోందని చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించే వాతావరణమే లేదన్నారు. దేశంలో చాలా మంది ఓటర్లు.. తొలి దశ పోలింగ్‌కు దూరంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఓటర్లంతా బయటకు వచ్చి ఓట్లు వేస్తేనే.. కేంద్రంలోని అధికారాన్ని మార్చగలమన్నారు.
తప్పు చేశారని తేలకుండానే వారిని జైల్లో పెట్టారు: సునీతా కేజ్రీవాల్‌
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరెన్‌లను తప్పు చేశారని తేల్చకుండానే జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ విమర్శించారు. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చడమే ఆయన చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్‌ తన జీవితాన్ని పణంగా పెట్టారని, ఐఐటీ గ్రాడ్యుయేటైన కేజ్రీవాల్‌ తలుచుకుంటే విదేశాలకు వెళ్లేవారని, కానీ ఆయన దేశభక్తికే మొగ్గుచూపారని చెప్పారు. తన భర్తను తీహార్‌ జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని విమర్శించారు. మధుమేహంతో బాధపడుతూ 12 ఏండ్ల నుంచి రోజూ ఇన్సులిన్‌ తీసుకుంటున్న కేజ్రీవాల్‌కు జైల్‌లో ఇన్సులిన్‌ను నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

Spread the love