అసహనం బుసలు కొట్టింది

impatience Hissed– ముమ్మాటికీ కోడ్‌ ఉల్లంఘనే
-బహు సంతానం కలిగిన సమాజమంటూ ఛీత్కారం
– రాజస్థాన్‌లో ముస్లింలపై విషం చిమ్మిన మోడీ
– చొరబాటుదారులంటూ నిందలు
– ప్రధాని వెబ్‌సైటులో కానరాని ఆంగ్ల అనువాద పాఠం
– అభ్యంతరకర పదాలు అదృశ్యం
ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి మందిర నిర్మాణం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని బీజేపీ తొలుత భావించింది. కానీ అది ఫలించేలా లేదు. తొలిదశ పోలింగులో తక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్డీయే యేతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలతో పోలిస్తే ఎన్డీయే సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలలోనే ఓటింగ్‌ శాతం బాగా తక్కువగా నమోదైందని, తమ జీవనానికి సంబంధించిన అంశాలకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనివల్ల అర్థమవుతోంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సైతం ఎక్కడా ఉత్సాహం కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనని బీజేపీ నాయకత్వానికి అర్థమైపోయింది. అందుకే తన అమ్ముల పొది నుండి మరోసారి మతం కార్డును బయటికి తీసింది. తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తోంది. రాజస్థాన్‌లో ఆదివారం నాటి ప్రధాని ఎన్నికల ప్రసంగం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్నది సుస్పష్టం. రాజస్థాన్‌లోని భన్‌స్వారా ప్రాంతంలో ఆదివారం నాడు గిరిజనులను ఉద్దేశించి ఆయన చేసిన ఎన్నికల ప్రసంగం ముస్లింలపై విషం చిమ్మింది. గిరిజనుల సంపదను దేశంలోని ముస్లింలకు దోచిపెట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా బహు సంతానాన్ని కలిగిన సమాజంగా ముస్లింలను అభివర్ణిస్తూ వారిని కించపరిచారు. గిరిజన ఓట్లపై కన్నేసిన మోడీ, గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించి ఆయనను కూడా వివాదంలోకి లాగారు. ఒకవేళ కాంగ్రెస్‌ను ఎన్నుకుంటే గిరిజనుల సంపదను ‘చొరబాటుదారుల’కు ధారాదత్తం చేస్తుందని హెచ్చరించారు. మైనారిటీ ముస్లింలను బీజేపీ నేతలు తరచూ చొరబాటుదారులుగా అభివర్ణిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చే మోడీ వివాదాస్పద వ్యాఖ్యల ఆంగ్ల అనువాదం ఆయన వ్యక్తిగత వెబ్‌సైటులో కన్పించడం లేదు. రాజస్థాన్‌లోని జలోర్‌, భన్‌స్వారాలో మోడీ చేసిన ప్రసంగాల ఆంగ్ల అనువాదాన్ని ఆయన అధికారిక వెబ్‌సైటులో ఉంచారు. రెచ్చగొట్టేలా మోడీ చేసిన ప్రసంగ సారాంశాన్ని చివరి పేరాలో పొందుపరిచారు. అయితే అందులో చొరబాటుదారులు, ముస్లింలు, అధిక సంతానం కలిగిన వారు…వంటి పదాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘కాంగ్రెస్‌ పార్టీ మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను సైతం లాక్కొని ముస్లింలకు ఇస్తుంది’ అనే రెచ్చగొట్టే వ్యాఖ్యను కూడా తొలగించారు.
నరేంద్ర మోడీని బలమైన నాయకుడిగా చూపేందుకు ఈ వెబ్‌సైట్‌ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటుంది. కానీ మోడీ చేసే వివాదాస్పద ప్రసంగాలను మాత్రం దీనిలో అప్‌లోడ్‌ చేయరు. జలోర్‌లో మోడీ హిందీలో చేసిన ప్రసంగాన్ని యధాతథంగా వెబ్‌సైటులో పెట్టారు. భన్‌స్వాడాలో చేసిన ప్రసంగ భాగాలు మాత్రం కన్పించడం లేదు. ఈ వెబ్‌సైటును సందర్శించే వారికి మోడీ విద్వేషపూరిత ప్రసంగం కన్పించదు. హిందీ భాష తెలిసిన వారు మాత్రమే వీడియోలో కన్పించే పదాలను అర్థం చేసుకోగలుగుతారు. సోమవారం మధ్యాహ్నం వరకూ మోడీ వెబ్‌సైట్‌ ఛానల్‌ ఆ ప్రసంగాన్ని అప్‌లోడ్‌ చేయలేదు. మోడీ ప్రసంగంపై పలువురు రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యాన్ని, అసమ్మతిని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఇప్పటి వరకూ తన ఎన్నికల ప్రసంగాలలో హిందూ ఓట్ల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఇంత నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు.
అప్పటి నుండే విద్వేషం
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఇచ్చిన ఓ ప్రకటనను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముస్లింలకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఆయన నిరాకరించారు. ‘మేము ఇద్దరం…మాకు పాతిక మంది’ అని నమ్మే ఓ సమాజానికి ఈ శిబిరాలు సంతాన కేంద్రాలుగా మారడం తనకు ఇష్టం లేదని ఆయన కరాఖండీగా చెప్పారు. ఆనాడు మత ఘర్షణల్లో బాధితులైన ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన విద్వేషాలను ఎలా రెచ్చగొట్టారో ఇప్పుడు కూడా భన్‌స్వారాలో అదే పని చేశారు. ముస్లిం శరణార్థులను చొరబాటుదారులుగా అభివర్ణించారు. ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి ఇది విరుద్ధంగా ఉంది. ఈ చట్టం దేశంలోని ముస్లిమేతర శరణార్థులను స్వాగతించడమే కాకుండా వారికి భారత పౌరసత్వాన్ని కల్పిస్తామని గ్యారంటీ ఇచ్చింది.

Spread the love