అన్నీ అవినీతి మరకలే..!

All are stains of corruption..!– అపరిమిత విరాళాలకు గేట్లు తెరిచిన మోడీ ప్రభుత్వం
– వాటి కోసమే పుట్టుకొచ్చిన కంపెనీలు
– సబ్సిడరీల ద్వారా బాండ్లు కొనుగోలు చేసిన బడా సంస్థలు
– దాడులు చేయించి సొమ్ము దండుకున్న పాలక పక్షం
న్యూఢిల్లీ : తన ప్రభుత్వానికి అవినీతి ఆరోపణల మరక అంటలేదని ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా చెబుతుంటారు. అయితే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత ఆయన వాదనలో ఏ మాత్రం నిజం లేదని, ప్రధాని మాటలన్నీ అబద్ధాల మూటలేనని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ఎన్నికల బాండ్ల గుట్టు రట్టయింది. వాటి ద్వారా అత్యధికంగా ఆర్థిక ప్రయోజనం పొందింది బీజేపీయేనని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తనది అవినీతి రహిత ప్రభుత్వమని మోడీ చెప్పుకోవడం హాస్యాస్పదమే అవుతుంది.
2017లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రారంభించడానికి ముందు దానిని గురించి పాలకులు ఎన్నో గొప్పలు చెప్పారు. బడా కార్పొరేట్‌ సంస్థలు కూడా ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పుకొచ్చారు. కాకపోతే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే కార్పొరేట్‌ సంస్థల గుర్తింపును గోప్యంగా ఉంచాలని అవి కోరుతున్నాయని తెలిపారు. అయితే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఎక్కువగా ఊరూ పేరూ లేని సంస్థలే ఉన్నాయి. వీటిలో అనేక సంస్థలు బడా కంపెనీలకు బినామీలుగా వ్యవహరిస్తున్నవే. ఇవి తమ నికర లాభాలలో పది నుండి వంద రెట్ల వరకూ వెచ్చించి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఏ కంపెనీ అయినా తన నికర లాభం కంటే వంద రెట్లు ఎక్కువ విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేయగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న.
విరాళాలు పొందడానికి ఈడీ, ఆదాయపన్ను సంస్థలను అధికార పక్షం దుర్వినియోగం చేసిందన్నది సుస్పష్టం. తన హయాంలో కంపెనీలు, వ్యక్తులకు చెందిన రూ.1.12 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రధాని మోడీ చెబుతారు. అయితే గత పదేండ్లలో ఈడీ పెట్టిన మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కేసులలో కేవలం 0.5% కేసులలో మాత్రమే శిక్షలు పడ్డాయి.
విరాళాల కోసమే వెలిసిన కంపెనీలు
కంపెనీలు తమ నికర లాభాలతో నిమిత్తం లేకుండా పెద్ద మొత్తంలో పార్టీలకు విరాళాలు అందించడం వెనుక ఆ సంస్థలకు ఉన్న ప్రయోజనాలు ఏమిటి? వాటి ఉద్దేశం ఏమిటి? వీటిలో కొన్ని కంపె నీలు దొడ్డిదారిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికే వెలిశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది క్విడ్‌ ప్రోకో తప్పించి మరొకటి కాదు. ఎన్నికల బాండ్ల కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు ఇదే ధర్మసందేహం కలిగింది.
దాడుల తర్వాతే విరాళాలు
ఈడీ, ఆదాయపన్ను అధికారులు దాడులు జరిపిన తర్వాతే పలు కంపెనీలు రూ.300 కోట్ల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు సమర్పించుకున్నాయని గతంలోనే న్యూస్‌ మినిట్‌, న్యూస్‌లాండ్రీ వంటి స్వతంత్ర మీడియా సంస్థలు తమ విచారణల్లో తేల్చాయి. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే పలు కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి భారీ మొత్తంలో విరాళాలు అందించాయని స్పష్టమవుతోంది. విరాళాలు అందజేసిన కంపెనీలలో ఎన్ని సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు గురై ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయన్నదే ప్రశ్న. అనేక చిన్న కంపెనీలు బడా కార్పొరేట్‌ సంస్థలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతూ బాండ్లు కొనుగోలు చేశాయి. రిలయన్స్‌ రిటైల్‌కు అనుబంధ కంపెనీలుగా కొనసాగుతున్న లిస్టింగ్‌ కాని సంస్థలే ఇందుకు ఉదాహరణ.
టెండర్లకు ప్రతిఫలంగా…
తనది అవినీతికి తావులేని పరిపాలన అంటూ మోడీ చెప్పుకున్న గొప్పలు కర్నాటక ఎన్నికల ప్రచార సమయంలోనే తేలిపోయాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పరిపాలనకు ’40శాతం ప్రభుత్వం’ అని పేరు కూడా వచ్చింది. ఫలితంగా ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కమలదళం పరాజయం పాలైంది. మోడీ పాలనలో అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమైన మాట నిజమే.
అయితే వాటి టెండర్లను దక్కించుకున్న కంపెనీలు అందుకు ప్రతిఫలంగా పాలక పక్షానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందించాయని ఊరూవాడా కోడై కూసింది.
ప్రభుత్వ భాగస్వామిగా ‘వేదాంత’
ఈడీ, సీబీఐ విచారణలు ఎదుర్కొన్న వేదాంత కంపెనీ 2019, 2022 మధ్యకాలంలో రూ.300 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ కాలంలోనే ప్రధాని మోడీ గుజరాత్‌లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సెమికండక్టర్‌ చిప్స్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి వేదాంతను ప్రభుత్వ భాగస్వామిగా ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఐదు బిలియన్‌ డాలర్ల గ్రాంటును ప్రకటించింది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు ముందు దీనిని ప్రారంభించారు.
తీవ్రమైన మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కంపెనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రభుత్వం ఎలా భాగస్వామిని చేసింది? ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే ఈ ప్రాజెక్టు నుండి ఆ తర్వాత వేదాంత వైదొలిగింది. టాటాల ఆధ్వర్యంలో పూర్తయిన ఈ ప్రాజెక్టును మోడీ ఇటీవలే ప్రారంభించారు.
ప్రచారాస్త్రంగా బాండ్లు
ఎన్నికల బాండ్ల పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద దోపిడీ రాకెట్‌ నడుపుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ఈ బాండ్ల బాగోతాన్ని ప్రజల్లోకి తీసికెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల బాండ్ల ద్వారా ప్రతిపక్షాలకు కూడా విరాళాలు అందాయి. కానీ బీజేపీకి అందిన విరాళాలలో ఇవి ఐదు నుండి ఇరవై శాతం లోపే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే రూ.20 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాలు మాత్రమే నమోదవుతాయి. వీటిలో 80 నుండి 85 శాతం విరాళాలు బీజేపీ ఖాతాలోనే పడడంతో ప్రతిపక్షాల వాటా మరింత తగ్గిపోయింది.
పరిమితులు ఎత్తేసి…
ఎన్నికల బాండ్ల పథకం రాకముందు విరాళాలపై పరిమితి ఉండేది. కంపెనీలు గత మూడు సంవత్సరాల నికర లాభాలలో 7.5శాతానికి మించి విరాళాలు ఇవ్వకూడదు. క్విడ్‌  ప్రోకోకు అడ్డుకట్ట వేయడానికే ఈ పరిమితిని విధించారు. ఈ విరాళాలను రాజకీయ పార్టీలు, కంపెనీలు తమ పుస్తకాలలో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు ఎక్కువ అవకాశం ఉండేది. ఎన్నికల బాండ్ల పథకం ఈ పరిమితిని ఎత్తేసింది. కంపెనీలు లేదా వ్యక్తులు అపరిమితంగా విరాళాలు అందించవచ్చు.  ఇది అవినీతిని ఆహ్వానించడమే అవుతుంది.
నిర్మలమ్మ సందేహాలు
దేశంలో మెగా ప్రాజెక్టులు చేపట్టిన మౌలిక సదుపాయాల కంపెనీల విరాళాల గుట్టును బయటపెట్టడంలో విచారణ సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల తన ప్రభుత్వాన్ని సమర్ధించుకుంటూ ఓ అర్థం లేని ప్రశ్న అడిగారు. దాడులు జరిగిన తర్వాతే ఆయా కంపెనీలు విరాళాలు అందించాయని మీకు ఎలా తెలుసంటూ ప్రశ్నించారు. దాడులకు ముందే బాండ్లు కొనుగోలు చేసి ఉండవచ్చు కదా అని కూడా సందేహం లేవనెత్తారు. అయితే విరాళాల వ్యవహారంలో బయటపడుతున్న సమాచారాన్ని పరిశీలిస్తే ఆమె వాదనలో ఏ మాత్రం పస లేదని తేలిపోతుంది.

Spread the love