కవిత బెయిల్‌ పై నేడు తీర్పు

కవిత బెయిల్‌ పై నేడు తీర్పునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై సోమవారం రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. లిక్కర్‌ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించిన ట్రయల్‌ కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం 10 గంటలకు స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్‌ పిటిషన్లపై తీర్పును చదివి వినిపించనున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కవిత రౌస్‌ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఏడేండ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని కవిత తరఫున న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. అలాగే పిఎంఎల్‌ఎ సెక్షన్‌ 45 ప్రకారం కవిత మహిళ కాబట్టి బెయిల్‌ కు అర్హురాలని కోర్టుకు నివేదించారు.
రేపు కోర్టు ముందుకు కవిత…!
మరోవైపు కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీ 7తో ముగియనుంది. దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే నేడు వెలువరించే తీర్పులో కవితకు బెయిల్‌ దక్కితే, జ్యుడీషియల్‌ కస్టడీ పొడగింపు ఉండదు. అలా కాదని కోర్టు ఆమెకు బెయిల్‌ నిరాకరిస్తే… మంగళవారం ఆమెను కోర్టు ముందు హాజరుపరచక తప్పదు. అయితే… ఈ సారి తనను నేరుగా కోర్టు ముందు హాజరుపరచాలని గతవారం కవిత ట్రయల్‌ కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశారు. గతంలో మాదిరిగా వర్చువల్‌ మోడ్‌ లో కాకుండా, నేరుగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అప్లికేషన్‌ ను బెయిల్‌ తీర్పు సందర్భంగా ఆమె న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. అలాగే, ఒకవేళ ట్రయల్‌ కోర్టు బెయిల్‌ నిరాకరిస్తే… ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదులు యోచిస్తున్నారు.

Spread the love