ఢీ అంటే ఢీ

Dhee means Dhee– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బస్తీమే సవాల్‌ ప్రచారాస్త్రంగా ‘రుణమాఫీ’
– రేవంత్‌, హరీష్‌ పరస్ఫర విమర్శలు
– 45 డిగ్రీలు దాటుతున్న ఎన్నికల వేడి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రుణమాఫీ…ఎన్నికల్లో రాజకీయపార్టీలు రైతులిచ్చిన హామీ.. మ్యానిఫెస్టోల్లోనూ పెట్టి మరీ రైతులు, ప్రజలను నమ్మబలికిన పథకం. అసెంబ్లీ ఎన్నికలు రానేవచ్చాయి. పోనేపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరింది. నాలుగు నెలలు కాకముందే పార్లమెంటు ఎన్నికల గంట మోగింది. ఈ ఎన్నికల్లో ఏజెండాగా రైతుల రుణమాఫీ ముందుకొచ్చింది. ప్రచారాస్త్రంగా మారిపోయింది. దాదాపు 33 జిల్లాల్లోని 40 నుంచి 50 లక్షల మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో మళ్లీ రుణమాఫీ చర్చనీయాంశమైంది. రాజకీయ వేడిని రగిలిస్తున్నది. నేతల మధ్య కాకను మరింత పెంచుతున్నది. రుణమాఫీ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేస్తే దాదాపు రూ. 40 వేల కోట్లు అవసరమవుతాయని అధికారిక అంచనా. సీఎం రేవంత్‌ నేతృత్వంలో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకు పూనుకున్న సంగతి తెలిసిందే. రైతుబంధు అమలుచేయడానికి ఇబ్బంది పడిందనే విమర్శలను మొదట్లోనే మూట కట్టుకుంది. ఇప్పుడు ఇప్పుడు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రంలో ఇండియా కూటమిని గద్దెనెక్కించాలని రేవంత్‌ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాల నుంచి రాజకీయ విమర్శలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఎన్నికలనగానే సాధారణంగా విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ప్రస్తుత రాజకీయ వాగ్భాణాలు ఒకింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనిఅయిపోయిందనీ, ఒకటి, రెండు సీట్లు మాత్రమే వస్తాయనే వ్యాఖ్యానాలు నేపథ్యంలో ఆపార్టీ నేతలు కాంగ్రెస్‌ సర్కారు, సీఎం రేవంత్‌ టార్టెట్‌ చేశారు. ఇదిలావుండగా రైతు రుణమాఫీ పంద్రాగస్టులోగా అమలుచేస్తామని సీఎం రేవంత్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలుచేయకపోతే రాజీనామా చేస్తావా’ అని సీఎం రేవంత్‌పైకి ఎన్నికల బాణాన్ని నేరుగా వదిలారు. ఇందుకు సీఎం రేవంత్‌ స్పందిస్తూ ‘రుణమాఫీని మేము అమలుచేస్తే, మీరు బీఆర్‌ఎస్‌ను రద్దుచేసుకుంటారా’ అని కౌంటర్‌ ఎటాక్‌ చేయడంతో మరింత అగ్గిరాజేసినట్టయింది. ఇరువురు కీలకనేతలు చేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. ఔరా ! అంటూ జనం ముక్కున వేలేసుకునే పరిస్థితికి కారణమవుతున్నాయి. నేతలిద్దరూ వ్యక్తిగత ప్రతిష్టకు వెళుతున్నారనే వ్యాఖ్యానాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. రైతుబంధే సరిగ్గా అమలుచేయలేదంటూ హరీశ్‌ ఇంకో బాంబు పేల్చారు. రేవంత్‌ అంటే మాటల కోతలు, కాంగ్రెస్‌ అంటే కరెంటు కోతలు అంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు సీఎం రేవంత్‌ ‘అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలుచేశాం..కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..ఆయన చేసిన అప్పులకు రూ.24 వేల కోట్లు మిత్తి కట్టాం..రుణమాఫీ చేస్తానని నేను హామీ ఇచ్చా..చేసిన వెంటనే బీఆర్‌ఎస్‌ను రద్దుచేస్తారా ? ఏ రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు..బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దు..రుణమాఫీ చేసే బాధ్యత నాది..కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలి” అని వ్యాఖ్యానించారు. ఇలా విమర్శ, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచార వేడి సైతం ఎండల వేడిలాగే 45 డిగ్రీలు దాటిపోతున్నది.

Spread the love