ఢిల్లీ మోడీకి..గల్లీ కేడీకి ఈ ఎన్నికల్లో గోరీ కట్టా లి

Delhi Modi..Gally code in this election Gori Katta Ltd– పదేండ్లు అధికారంలో ఉండి మెదక్‌కు ఏం చేసిండ్రు
– పదేండ్లు ఇక్కడే ఉంటాం.. ఎవడితో వస్తావో రా..: కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌
– పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేసింది ఇందిరాగాంధీ కాదా..?
– ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతం
– ఖాళీ చేయడానికి కాంగ్రెస్సేమైన పుల్‌ బాటిలా..?
– ఇందిరమ్మ వారసుడిగా నీలం మధును గెలిపించండి:మెదక్‌ కార్నర్‌ సభలో సీఎం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ కాబోతుందని కేసీఆర్‌ అంటున్నారు.. ఖాళీ చేయడానికి ఇదేమైనా పుల్‌బాటిలా..? బిడ్డ కేసీఆర్‌.. కాంగ్రెస్‌ను ప్రజలెన్నుకుంటే మేం అధికారంలోకి వచ్చాం. నీవు, మోడీ చీకట్లో మాట్లాడుకుంటే మా ప్రభుత్వం పడిపోతుందా..? ఎవడితో వస్తావో రా..! కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారని అంటున్నవ్‌ కదా..? కాంగ్రెస్‌ను టచ్‌ చేసి చూడు.. హైటెన్షన్‌ వైరు మీద చేయి వేస్తే ఏమవుతదో అట్ల మాడి మసైతవ్‌. నేనేమైనా జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని అనుకుంటున్నవా..? బట్టలూడదీసి రోడ్డుపై పరుగెత్తించి కొట్టిస్త బిడ్డ’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, మోడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెదక్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందరంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం రాందాస్‌ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ సభలో ప్రసంగించారు.
1980లో ఇందిరాగాంధీని మెదక్‌ ఎంపీగా గెలిపించి ప్రధాన మంత్రిని చేసిన చరిత్ర మెదక్‌ ప్రాంత ప్రజలకుందని రేవంత్‌ అన్నారు. ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ మెదక్‌ ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఇక్రిషాట్‌, ఐడీఎల్‌, డైనమిక్‌ వాచ్‌ వంటి సంస్థలను తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి ఫలితంగానే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు మెదక్‌ ప్రాంతానికి వచ్చి బతుకుతున్నారని చెప్పారు. పదేండ్లు ప్రధానిగా మోడీ ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేడీ (కేసీఆర్‌) పదేండ్లు పరిపాలించి మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు. 25 ఏండ్లుగా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉందని, అయినా ఒక్క పరిశ్రమ తెచ్చింది లేదన్నారు. నల్లచట్టాలు తెచ్చి రైతుల్ని బలితీసుకున్న మోడీ.. వాళ్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని, 2022 నాటికి పేదలందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వల్ల జరిగిందేమీ లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి రాజకీయంగా గోరీ కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో లక్షలాది మంది ఆడబిడ్డలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతున్నారని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందుతుందని, ప్రజల ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించామన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్లు తుడుస్తున్న కాంగ్రెస్‌ పాలన చూసి కేసీఆర్‌కు కడుపు మండుతోందన్నారు. అందుకే ఓర్వలేక కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలిచ్చిన ఇందిరాగాంధీ మెదక్‌ ఎంపీగానే నేలకొరిగారని, ఆమె వారసుడిగా నీలం మధును మెదక్‌ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందన్నారు. తల్లిదండ్రుల్లేని బీసీ బిడ్డ నీలం మధును ప్రజలే తల్లిదండ్రులై గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌ గులాంగిరీ చేసే వ్యక్తి అని కలెక్టర్‌గా ఉండి మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ కింద 14 గ్రామాల ప్రజలపై దౌర్జన్యాలు చేసి భూములు లాక్కొని రోడ్డున పడేసిన నీచుడని విమర్శించారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిస్తే మోడీ దగ్గరికెళ్లి వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్ని పైసలు తెచ్చావో చెప్పి ప్రజల్ని ఓట్లు అడగాలని అన్నారు. ప్రజలు మెచ్చిన పాలన అందిస్తూ పదేండ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో దేవాదాయ శాఖ మంత్రి, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా సురేఖ, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు తూర్పు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కాట శ్రీనివాస గౌడ్‌, ఆవుల రాజిరెడ్డి, చెర్కు శ్రీనివాసరెడ్డి, నర్సారెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు.

Spread the love