ఎండా..వానా..

ఎండా..వానా..– వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత
– ఈ ఏడాది ఇదే అత్యధికం పలుచోట్ల మోస్తరు వర్షం..
– అక్కడక్కడా వడగండ్లు, పిడుగులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆదివారం విభిన్న వాతావరణం నెలకొంది. పొద్దస్తమానం భానుడు తన ప్రతాపాన్ని చూపితే సాయంత్రం వేళ్ల వర్షం పలుకరించింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడింది.
ఒకటెండ్రు చోట్ల పిడుగులు పడ్డాయి. వచ్చే మూడ్రోజులు కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం కరీంనగర్‌, జగిత్యాల, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, నిజామాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, వికారాబాద్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, జనగాం, మహబూబాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. 28 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోద య్యాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌డీపీఎస్‌ నివేదిక పై జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత దాటడం ఇదే తొలిసారి. ఉక్కపోత తీవ్రత కూడా పెరిగింది. గాలిలో తేమశాతం భారీగా తగ్గింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే.
వెల్గటూరు (జగిత్యాల) 47.1 డిగ్రీలు
గోదూరు(జగిత్యాల) 46.8 డిగ్రీలు
వీణవంక (కరీంనగర్‌) 46.7 డిగ్రీలు
అల్లీపూర్‌(జగిత్యాల) 46.7 డిగ్రీలు
బుట్టాపూర్‌ (నిర్మల్‌) 46.5 డిగ్రీలు
హాజీపూర్‌(మంచిర్యాల) 46.3 డిగ్రీలు
జన్నారం (మంచిర్యాల) 46.3 డిగ్రీలు
నిజామాబాద్‌ 46.2 డిగ్రీలు
వెల్గనూరు(మంచిర్యాల) 46.2 డిగ్రీలు
కాగజ్‌నగర 46.11డిగ్రీలు

Spread the love