మేం నిత్యం ప్రజల మధ్యనే..

We are always among people..– ఎన్నికలప్పుడే వచ్చి మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దు
– నిజాయితీగా పని చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ని గెలిపించాలి
– పెద్ద కందుకూరు బహిరంగ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
– ఓటు చాలా విలువైనది : ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల కోసం పోరాడేది ఒక్క సీపీఐ(ఎం) మాత్రమేనని, ఇప్పటికే పోరాటాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించిన చరిత్ర ఎర్రజెండాకి ఉందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్‌లో నిర్వహిం చిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు మాయమాటలతో అనేకమంది వచ్చి ఓట్లు అడుగుతారని.. వారిని నమ్మొద్దని సూచించారు. నికరంగా ప్రజల కోసం నిజాయితీగా పని చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చరిత్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఎర్రజెండా మాత్రమే ప్రజల సమస్యలపై గళం విప్పుతుందని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థుల చరిత్ర.. సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ ముందు, తమ పార్టీ చరిత్ర ముందు పైసకు పనికిరావని అన్నారు. విలువల్లేని పార్టీలను, విలువల్లేని అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎండీ జహంగీర్‌ మాట్లాడుతూ.. ఓటు విలువ చాలా ముఖ్యమైనదని, ధనవంతునికైనా ..పేదవానికైనా ఒకే ఒకటి ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ ఆలోచన చేసి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా ప్రజా వ్యతిరేక తప్పుడు పనులు చేస్తోందని తెలిపారు. ప్రజల మధ్య తగాదాలు సృష్టించి పబ్బం గడుపుతున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు. గ్యాస్‌ ధర, పెట్రోల్‌ ధరలు పెరగడానికి ఆ పార్టీనే కారణమన్నారు. భువనగిరి పార్లమెంటుకు మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు కాంగ్రెస్‌, ఒక్కసారి బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌ గెలిస్తే ఇద్దరు అన్నదమ్ములే పరిపాలన చేశారన్నారు. వారి పరిపాలనలో భువనగిరి ఏం అభివృద్ధి చెందిందో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఒకసారి ఎంపీగా పనిచేసిన బూర నర్సయ్యగౌడ్‌ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. ఎన్నికలంటే డబ్బు, మద్యం కాదన్నారు. అందుకే డబ్బు రాజకీయాలను ఓడించాలన్నారు. సమస్త కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడింది ఎర్రజెండా అని, అందుకే ఆ జెండా పట్టుకుని పోటీ చేస్తున్న తనను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, మంగ నర్సింహులు, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కె లతీఫ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్‌, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్‌రెడ్డి, నాయకులు షేక్‌ ఉస్మాన్‌ షరీఫ్‌, పెద్దకందుకూరు మాజీ సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love