సీపీఐ(ఎం) వెంటే మేమంతా..

We are all with CPI(M).– భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థికి ప్రజల ఘనస్వాగతం
– జనగామ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) శ్రేణుల విస్తృత ప్రచారం
– ప్రజల సాధకబాధకాలు విన్న జహంగీర్‌
– అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌
నవతెలంగాణ-జనగామ/బచ్చన్నపేట
దేశంలో మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ పిలుపునిచ్చారు. బుధవారం జనగామ నియోజకవర్గ పరిధిలో బచ్చన్న పేట మండలం పోచన్నపేట, బచ్చన్నపేట మండల కేంద్రం, గోపాల్‌ నగర్‌, కొడ్వటూర్‌, కేశిరెడ్డిపల్లి, నర్మేట్ట మండల కేంద్రం, జనగామ మండలంలోని ఎర్రగుల్లపాడు, మరిగడి, గానుగు పహాడ్‌ వడ్లకొండ తదితర గ్రామాల్లో ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోచన్నపేటలో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆటపాటలతో ఆదరించి ఆశీర్వదించారు. తమ వెంట మేముంటామని ఆయనతో కలిసి ఊరంతా కలియతిరిగారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి జహంగీర్‌ ప్రజల సాధకబాధకాలు తెలుసుకుని.. ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్‌ అధ్యక్షత వహించగా జహంగీర్‌ మాట్లాడారు.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా.. ఓటేసి పార్లమెంట్‌కు పంపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. 30 సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నానన్నారు. ఈ ఎన్నికలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపిస్తే పార్లమెంటులో కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులు కాదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బచ్చన్నపేట ప్రాంతానికి నేటికీ సాగునీరు అందక.. భూగర్భ జలాలు అడుగంటిపోయి వేలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. జనగామ ప్రాంతానికి పరిశ్రమలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిందని, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం)కు అవకాశం ఇస్తే.. జనగామ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లో మధ్య దళారీల దోపిడీని అరికట్టడంలో, పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించింది సీపీఐ(ఎం) అని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో అనావృష్టి, వడగళ్ల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ 15 రోజులు మూతపడితే.. సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున ఆందోళన చేసి పంటల కొనుగోళ్లు చేయించిందన్నారు. మద్దతు ధర కల్పించి రైతుల పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పోరాటం చేసి విజయం సాధించింది సీపీఐ(ఎం) అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. డబ్బుల సంచులతో వస్తున్న బూర్జువా పార్టీల అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పి.. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న తమను గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. జనగామ ప్రాంతంలో తమ పార్టీ పోరాటాల ఫలితంగా ఇండ్ల స్థలాలు, భూములు సాధించామని, నేడు ఆ ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారని తెలిపారు. నిజాయితీగా నికరంగా అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న జహంగీర్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. జనగామ ప్రాంత ప్రజలకు ఎర్రజెండా పరిపాలన సుపరిచితమని, గతంలో సీపీఐ(ఎం)ను ఆదరించి గెలిపించిన చరిత్ర జనగామ ప్రాంత ప్రజలకు ఉందని వివరించారు. జనగామ ప్రాంత ప్రజలు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇవి అహల్య, సాంబరాజు యాదగిరి, నాయకులు విజేందర్‌, జోగు ప్రకాష్‌, బొట్ల శేఖర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు యాటల సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love